ఒకే దారం.. ఎందుకీ అంతరం!

16 Mar, 2017 03:56 IST|Sakshi
ఒకే దారం.. ఎందుకీ అంతరం!

- కోటీశ్వరులుగా యజమానులు.. కోటి కష్టాల్లో కార్మికులు, ఆసాములు
- సిరిసిల్లలో మారని నేతన్న తలరాత


సాక్షి, సిరిసిల్ల:
వస్త్ర పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సిరిసిల్లలో వైరుధ్యాలకు సజీవ తార్కా ణాలెన్నో! ఒకే వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కొందరు రూ.లక్షల్లో సంపాదిస్తుంటే.. మరికొంతమంది ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని వస్త్ర పరిశ్రమ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలోనూ బలవన్మరణాలు తప్పడం లేదు. నేత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ.వందల కోట్లు, అప్పుల ఊబి నుంచి నేతన్నలను బయట పడేయలేకపోతున్నాయి.

ఎందుకీ అంతరం?
ఒకే వృత్తి.. ఒకే వస్త్ర పరిశ్రమ.. కొందరు కోటీశ్వరులు.. మరికొందరిది దుర్భర దారిద్య్రం.. ఆత్మహత్యలు.. ఏమిటి ఈ అంతరం..? అంటూ రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్‌ శైలజారామయ్యర్‌ గత నెలలో సిరిసిల్లలో యజమానులు, ఆసాములు, కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రశ్నించారు. ఓ వైపు యజమానులు నెలకు సుమారు రూ.3 నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తుంటే.. మరోవైపు కార్మికులు, ఆసాములు ఉపాధి కరువై ప్రాణాలు తీసుకొంటున్న విచిత్ర వైనం సిరిసిల్లలో ఏళ్లుగా కొనసాగుతోంది. నేత కార్మికులకు శాశ్వత ఉపాధి చూపించాలనే సంకల్పంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులకు ఎన్నో చిక్కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతులు వ్యాపారం చేస్తుంటే.. పెట్టుబడులు పెట్టలేని వాళ్లు కార్మికులుగా మారడం ఏ రంగంలోనైనా సాధారణమే. కానీ ఒకే పరిశ్రమపై ఆధారపడిన వాళ్లలో కొందరు కోటీశ్వరులవుతుంటే కొందరిౖకైనా కనీస ఉపాధి దక్కాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు.

కార్మికుల శ్రమ దోపిడీ ఇదీ..
వస్త్ర పరిశ్రమలో యజమానులు, ఆసాములు, కార్మికులు అనే మూడంచెల వ్యవస్థ కొనసాగుతోంది. పెట్టుబడిదారులు యజమానులైతే.. లూమ్‌లు నడిపించేది ఆసాములు. కూలీ పనిచేసేది కార్మికులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 100 మంది యజమానులు, దాదాపు 2,500 మంది ఆసాములు, అన్ని విభాగాల్లో దాదాపు 15 వేల మంది కార్మికులు ఉన్నారని అంచనా. రోజుకు 12 గంటలు పనిచేస్తున్నా కార్మికుల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. 2014లో ఒకసారి, 2015లో మరోసారి కార్మికులకు చెల్లించే కూలీ పెంచేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ చొరవతో ఒప్పందం కుదిరింది. 10 పిక్కులకుగాను అంతకుముందు రూ.0.17 పైసలు చెల్లిస్తుండగా.. రూ.0.20 పైసలకు పెంచాలని నిర్ణయించారు. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ కొద్ది రోజులపాటు రూ.0.20 పైసల కూలీని అమలు చేసి.. మళ్లీ పాత రూ.0.17 పైసలు మాత్రమే చెల్లించారు. దీంతో రోజుకు 12 గంటలు పనిచేసినా.. కార్మికుడి ఆదాయం నెలకు రూ.5 వేలు దాటడం లేదు.

ఆసాములదీ అదే దుస్థితి..
యజమానుల నుంచి నూలు కొనుగోలు చేసి, కార్మికులకు పని కల్పిస్తూ లూమ్‌లపై వస్త్రాన్ని తయారు చేసే ఆసాముల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్‌కు అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయడానికి ఆసాములకు సరిపడా పెట్టుబడి ఉండడం లేదు. పాత మగ్గాలపై పాలిస్టర్‌ తప్ప మార్కెట్‌ డిమాండ్‌కు తగిన ఉత్పత్తులు రావడం లేదు. దీంతో సహజంగానే యజమానులపై ఆసాములు ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంగా మళ్లీ పెట్టుబడి పెట్టిన యజమానులే అధిక లాభం పొందుతున్నారు. పైపెచ్చు వస్త్రాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం.. బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఆసాములు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వమే ఆర్డర్లు ఇస్తున్నా.. ఆసాములు, కార్మికుల పరిస్థితి మెరుగుపడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల యూనిఫారాలకు దాదాపు కోటి 15 లక్షల మీటర్ల వస్త్రాన్ని తయారు చేసి అందించినా.. యజ మానులు తప్ప ఆసాములు, కార్మికుల బతుకులు పెద్దగా బాగుపడ్డ దాఖలాలు కనిపించ డం లేదు. పైగా కొందరు యజమానులే బోగస్‌ మ్యాక్స్‌ సొసైటీలు సృష్టించి బిల్లులు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆసామి ఆత్మహత్య
సాంచాల షెడ్డులో ఉరేసుకుని బలవన్మరణం
సిరిసిల్ల టౌన్‌: నెలరోజులుగా సాంచాలు నడవక ఉపాధి కోల్పోవడం.. చేసిన అప్పులు భారమవడంతో సిరిసిల్లలో బుధవారం సత్యనారాయణ(52) అనే ఆసామి తన సాంచాల షెడ్డులోనే ఉరేసుకుని చనిపోయాడు. వెంకంపేటకు చెందిన ఈయన పది సాంచాల ద్వారా కాటన్‌ వస్త్రాన్ని(కేస్మిట్‌) ఉత్పత్తి చేస్తాడు. మూడేళ్ల క్రితం కూతురికి వివాహం చేశాడు. ఏడాది కిందటే కొడుకు కాలు విరగడంతో అప్పు తెచ్చి వైద్యం చేయించాడు. ఇలా కుటుంబ అవసరాల కోసం ఇప్పటి వరకు రూ.6లక్షలు అప్పు చేశాడు. వీటికితోడు వస్త్రోత్పత్తిదారులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కడం లేదు. చేతిలో పైసల్లేక, అప్పులు తీర్చే దారిలేక సత్యనారాయణ నెల రోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో అందరితో మాట్లాడిన ఆయన.. బుధవారం తెల్లారేసరికి సాంచాల షెడ్డులో ఉరేసుకుని కనిపించాడు.

కార్మికులకు రోజు రూ.600 వచ్చేలా చూడాలి
కార్మికులకు రోజుకు రూ.600 కూలీ వచ్చేట్లు చట్ట సవరణ చేయాలి. ఇది జరగాలంటే ఆసాములకు పెట్టుబడి కోసం బ్యాం కుల నుంచి రుణ సౌకర్యం కల్పించాలి. బిల్లులు త్వరగా ఇప్పించాలి. లేదంటే కార్మికుల పేరిట ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు యజమానుల ఖాతాల్లోకి వెళ్లడం తప్ప ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు.
– సామల మల్లేశం, గౌరవ అధ్యక్షుడు, పవర్‌లూం కార్మిక సంఘం

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు