‘శిరీష- ప్రభాకర్‌ రెడ్డి’ కేసు దర్యాప్తు వేగవంతం

15 Jun, 2017 14:25 IST|Sakshi
‘శిరీష- ప్రభాకర్‌ రెడ్డి’ కేసు దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్‌: సంచలనం రేపిన బ్యుటీషియన్‌ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల కేసుల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ రెండు కేసుల్లోనూ కీలకంగా మారిన ఫొటో స్టుడియో యజమాని రాజీవ్‌ను పోలీసులు గురువారం మధ్యాహ్నం కుకునూర్‌పల్లికి తీసుకెళ్లారు.

ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న.. గురువారం ఉదయం బంజారాహిల్స్‌(హైదరాబాద్‌) పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శిరీష ఆత్మహత్య కేసులో లభించిన ఆధారాలు, రాజీవ్‌, శ్రావణ్‌ల వాగ్మూలం తదితర విషయాలను బంజారాహిల్స్‌ పోలీసులు తిరుపతన్నకు వివరించారు.

ఆత్మహత్యలు జరగడానికి ముందు కుకునూర్‌పల్లిలోని ప్రభాకర్‌రెడ్డికి చెందిన క్వార్టర్స్‌లో శిరీష, రాజీవ్‌, శ్రావణ్‌లు కలిసిఉన్నందున అప్పుడేం జరిగిందో బతికున్న ఇద్దరికే తెలుసుకాబట్టి ఆ మేరకు రాజీవ్‌, శ్రావణ్‌లనుంచి విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శిరీషపై ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడా? లేదా? అనే విషయం ఇప్పటిదాకా వెల్లడికాలేదు.

ఇదిలాఉంటే బుధవారం సొంత స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతదేహానికి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆయన స్వస్థలం టంగుటూరు(యాదాద్రి జిల్లా ఆలేరు మండలం)కు తరలించారు. నేటి సాయంత్రం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇక బ్యూటీషియన్‌ శిరీష అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లాని ఆమె స్వస్థలం ఆచంటలో బుధవారమే నిర్వహించారు.
(చదవండి:  రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు)

మరిన్ని వార్తలు