సిట్ ఎదుట చార్మి.. ఆరు గంటలు!

26 Jul, 2017 16:47 IST|Sakshi
సిట్ ఎదుట చార్మి.. ఆరు గంటలు!

హైకోర్టు ఆదేశాలతో ఐదులోపే ముగిసిన విచారణ
 

హైదరాబాద్‌: టాలీవుడ్‌ను కుదుపుతున్న డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ చార్మిపై సిట్‌ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటలపాటు సిట్‌ అధికారులు ఆమెను ప్రశ్నించారు. నలుగురు మహిళా అధికారుల బృందం ఆమెకు ప్రశ్నలను సంధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఐదుగంటలలోపే చార్మిపై సిట్‌ విచారణ ముగిసింది. చార్మి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న సిట్‌ అధికారులు.. మరోసారి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఉల్లాసంగా మీడియాకు చేతులు ఊపుతూ చార్మి వెళ్లిపోవడం గమనార్హం.

ప్రధానం డ్రగ్స్ ముఠా సభ్యుడు కెల్విన్‌తో సంబంధాలపైనే చార్మిని సిట్‌ ప్రశ్నించినట్టు సమాచారం. కెల్విన్‌తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? మీరు డ్రగ్స్‌ తీసుకుంటురా? పబ్‌లకు వెళుతారా? పబ్‌ల్లో డ్రగ్స్‌ సంస్కృతిపై మీ అభిప్రాయం ఏమిటి? టాలీవుడ్‌లో డ్రగ్స్‌ అలవాటు ఎవరెవరికి ఉంది? తదితర ప్రశ్నలను సిట్‌ అధికారులు చార్మికి వేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో సంబంధాల గురించి కూడా ఆరాతీసినట్టు సమాచారం.

ప్రధానంగా సాక్షిగా భావించి చార్మిని విచారిస్తున్నామని సిట్‌ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసింది. చార్మిని ప్రధానంగా కెల్విన్‌ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చార్మి హీరోయిన్‌గా తెరకెక్కిన 'జ్యోతిలక్ష్మి' సినిమా వేడుకలో కెల్విన్‌ పాల్గొన్న ఫొటోలను చూపించి.. ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

చట్టప్రకారం నిబంధనలను అనుసరించే హీరోయిన్‌ చార్మి కౌర్‌ను విచారించాలని ఎక్సైజ్‌ సిట్ అధికారులను హైకోర్టు ఆదేశిం చిన సంగతి తెలిసిందే. చార్మి ఇష్టానికి విరుద్ధంగా ఆమె రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించవద్దని.. ఈ విషయంలో ఆమెపై ఒత్తిడి చేయవద్దని సూచించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, మహిళా అధికారుల సమక్షంలో మాత్రమే ప్రశ్నించాలని పేర్కొంది. విచారణ పూర్తికాకుంటే మరుసటి రోజు కొనసాగించవచ్చని సూచించింది.

అంతకుముందు చార్మి తరఫున న్యాయవాది పి.విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సిట్‌ అధికారులు విచారణకు పిలిచిన వారినుంచి బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చార్మి విషయంలోనూ అలాగే జరిగే అవకాశముందని.. ఇది హక్కు లను ఉల్లంఘించడమేనన్నారు. దీనికి సిట్‌ తరఫు లాయర్‌ బదులిస్తూ సిట్‌ అధికారులు ఎవరి నుంచీ బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకోవడం లేదని తెలిపారు.

 

మరిన్ని వార్తలు