విమానాశ్రయాల ప్రైవేటీకరణ గడువు పెంపు

29 Jan, 2014 01:53 IST|Sakshi
విమానాశ్రయాల ప్రైవేటీకరణ గడువు పెంపు

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అభివృద్ధి  చేసిన ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ మళ్లీ వాయిదా పడింది. చెన్నై, కోల్‌కత, లక్నో, గౌహతి విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని  వచ్చే నెల 17కు, జైపూర్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు వచ్చే నెల 12కు పొడిగించామని అధికార వర్గాలు తెలిపాయి.

 త్వరలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ఈ విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిమిత్తం కంపెనీలను ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేయగలదని ఉన్నతాధికారొకరు వెల్లడించారు. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ ప్రక్రియ సజావుగా సాగకపోవడం, తాజాగా గడువు పొడిగింపు తదితర కారణాల వల్ల  మొత్తం ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులంటున్నారు. కాగా వేల కోట్ల ప్రజాధనంతో అభివృద్ధి చేసిన విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

మరిన్ని వార్తలు