దేశవ్యాప్తంగా వర్ష విలయం

1 Aug, 2016 08:05 IST|Sakshi
దేశవ్యాప్తంగా వర్ష విలయం

* ముంబైలో భవనం కూలి 9 మంది దుర్మరణం
* ముంబైలో  నెలరోజుల్లో 925 మి.మి. వర్షపాతం
ముంబై: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముంబైతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన థానే, పాల్‌ఘర్ జిల్లాల పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సామాన్య జన జీవనం అస్తవ్యస్తమైంది. ముంబై శివారులోని భివండీలో భారీ వర్షాలకు భవంతి కుప్పకూలి 9 మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు.  మృతుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ రెండతస్తుల భవంతిలో ఏడెనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయని, ఉదయం 9.30 గంటలకు భవనం కూలిపోయిందని భివండీ తహసీల్దార్ వైశాలి లాంబేట్ తెలిపారు.

థానేలో ఘోడ్‌బందర్ రోడ్డులో మురుగు కాల్వ పొంగడంతో 12 మంది చిక్కుకుపోయారు. విపత్తు నిర్వహణ సిబ్బంది వారిని రక్షించారు. థానేలో ఆదివారం సాయంత్రం వరకూ 175 మి.మి. వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ముంబైలో జూలై నెల సరాసరి వర్షపాతం 799.7 మి.మీ.లు కాగా, ఈసారి 925.6 మి.మీ.లు నమోదైంది.  నాసిక్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో  ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో నాసిక్‌లో 158.4 మి.మీ. వర్షం కురిసింది. సోమవారం కూడా ముంబైలో  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  
 
బిహార్, అస్సాంలో మారని వరద దుస్థితి
బిహార్, అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. బిహార్‌లో 12 జిల్లాలో మొత్తం 27.5 లక్షల మంది వరద బారిన పడ్డారు. 8 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అస్సాంలోని 28 జిల్లాల్లో 37 లక్షల మంది వరద ముంపులో చిక్కుకున్నారు. ఇంతవరకూ 31 మంది మరణించారు.  నేమాటిఘాట్, గోల్పారా, ధుబ్రి పట్టణాల సమీపంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఒడిశాలో పిడుగుపాటుకు మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 41కి చేరింది.

బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. గంగ, శారదా నదులు పలుచోట్ల ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో భారీ వర్షాలకు కొండచరియలు పడడంతో ఐదుగురు యాత్రికులు గాయపడ్డారు. చార్‌ధామ్ యాత్ర మా ర్గంతో పాటు పలు రోడ్లు మూతబడ్డాయి.

మరిన్ని వార్తలు