'ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే రూ. లక్ష'

26 Nov, 2015 11:58 IST|Sakshi
రాజీవ్ టాండన్ ఫేస్ బుక్ పేజీలోని ఫోటో

లుధియానా: తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిపై అతి పోకడలను శివసేన కొనసాగిస్తూనే ఉంది. సుధీంద్ర కులకర్ణిపై నల్లరంగుతో శివసేన కార్యకర్తలు దాడి చేసిన ఉదంతం కనుమరుగు కాకముందే మరోసారి తనదైన శైలిలో నిరసనకు దిగింది. మత అసహనంపై బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన పంజాబ్ నాయకులు ఆందోళన చేపట్టారు.

లుధియానాలో 'దంగల్' సినిమా యూనిట్ బస చేసిన ఎంబీడీ రాడిసన్ బ్లూ హోటల్ వద్ద నిరసనకు దిగారు. అంతటితో ఆగకుండా ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. 'ఎవరైనా ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే ప్రతి దెబ్బకు శివసేన తరపున లక్ష రూపాయల చొప్పున అందజేస్తాం' అని శివసేన పంజాబ్ విభాగం అధ్యక్షుడు రాజీవ్ టాండన్ ప్రకటించారు. ఈ ఆఫర్ ను 'దంగల్' సినిమా టీమ్ సభ్యులు, ఎంబీడీ రాడిసన్ బ్లూ హోటల్ సిబ్బంది కూడా వినియోగించుకోవచ్చన్నారు. ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టినవారిని సాహసవంతులు, దేశభక్తి కలిగిన వారిగా గౌరవిస్తామని చెప్పారు.

శివసేన ఆందోళన నేపథ్యంలో హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, వారం రోజుల విశ్రాంతి తర్వాత 'దంగల్' సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమిర్‌ ఖాన్ గురువారం ఉదయం లుధియానా చేరుకున్నారు. కండరాలు పట్టేయడంతో వారంపాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు