రైతుల నుంచి వడ్డీ గుంజొద్దు

17 Oct, 2015 02:36 IST|Sakshi
రైతుల నుంచి వడ్డీ గుంజొద్దు

* ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సర్కారు ఆదేశాలు
* లక్ష లోపు రుణాలకు వడ్డీ లేదని స్పష్టీకరణ
* ఆ మేరకు బ్యాంకుల ఎదుట బ్యానర్లు కట్టాలని సూచన
* వడ్డీ వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళానికి తెర దింపాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టంచేసింది. వడ్డీ వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అన్ని బ్యాంకులు.. బ్రాంచీల వారీగా రుణమాఫీలో లబ్ధి పొందిన రైతుల పంట రుణాల ఖాతా(స్టేట్‌మెంట్) వివరాలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. శుక్రవారమిక్కడ ఎస్‌బీహెచ్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్, వ్యవసాయ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ శివశ్రీతో పాటు అన్ని బ్యాంకుల అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.

ప్రభుత్వం మాఫీ చేసిన పంట రుణాలకు వడ్డీ మాఫీ కూడా వర్తిస్తుంది. కానీ ఈ డబ్బును రైతుల ఖాతాలో జమ కట్టే విషయంలో కొన్ని బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు, గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సర్కారుకు నివేదిక అందించాయి. దీంతో అదే ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ జరిగింది.
 
మాఫీపై ప్రచారం కల్పించండి..
రైతుల నుంచి వడ్డీ వసూలు చేయటం లేదని, రుణమాఫీ చేసిన రైతులకు సంబంధించిన ఖాతాల్లో ప్రభుత్వం ఇచ్చిన రెండు విడతల నిధులు జమ చేసినట్లుగా బ్యాంకర్లు వివరణ ఇచ్చారు. అయినా వరుసగా ఫిర్యాదులు అందుతున్నందున రుణమాఫీకి సంబంధించి రైతులకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లకు సూచించారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు అందితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడేది లేదని హెచ్చరించారు.

రైతుల నుంచి వడ్డీ వసూలు చేయటం లేదని, లక్ష లోపు పంట రుణాలకు వడ్డీమాఫీ వర్తిస్తుందనే అంశానికి తగినంత ప్రచారం కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రజలందరికీ ఈ విషయం తెలిసేలా అన్ని బ్యాంకులు బ్రాంచీల ఎదుట  బ్యానర్లను కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ మాఫీ పథకం వర్తిస్తుందని, ప్రభుత్వం మాఫీ చేసిన రుణాలపై వడ్డీని వసూలు చేయటం లేదని అందరికీ అర్థమయ్యేలా ఈ బ్యానర్లు ఉండాలని సూచిం చారు. దీంతో పాటు రైతులకు ఎంత రుణం మాఫీ అయింది.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎం త చెల్లించింది.. ఖాతాలో మిగిలిన రుణమెంత? అన్న వివరాలన్నీ ప్రచురించాలని పేర్కొన్నారు. వారంలోగా ఈ నిర్ణయాలు అమలు చేయాలని సమావేశం తీర్మానించింది.

మరిన్ని వార్తలు