నిద్ర లేకుండా రికార్డులు సృష్టించారు..

16 Aug, 2016 09:30 IST|Sakshi
నిద్ర లేకుండా రికార్డులు సృష్టించారు..

నిద్ర సృష్టిలోని అన్ని జీవులకు అవసరమైన జీవక్రియల్లో అతిముఖ్యమైనది. గాలి, నీరు, ఆహారంతోపాటు ప్రతిరోజూ నిద్ర కూడా తప్పనిసరి. ఈ విషయంలో అనేక జీవులకు వేర్వేరు లక్షణాలున్నాయి. నిద్రపోవడం కూడా ఒకరకంగా శక్తిని సమకూర్చుకోవడమే. అందుకే మానవులకు తప్పనిసరిగా ప్రతిరోజూ కనీసం ఏడు గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తారు.

మానవులు నిద్రలేకుంటే మరుసటి రోజు తీవ్ర అలసటకు లోనవుతారు. సరిగ్గా నిద్రపట్టకపోవడాన్ని ఒక అనారోగ్య సూచకంగా భావిస్తారు. అలాగని రోజులో ఎక్కువ సమయం నిద్రపోతున్నా అనారోగ్యంగానే భావించాలి. రోజులతరబడి నిద్రపోకపోవడం ప్రమాదకరమే అయినా కొందరు అలా నిద్రపోకుండానే ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.
 
 వారి వివరాలేంటో తెలుసుకుందాం...
 నిద్రలేకుండా 11 రోజులు..
మీరు ఎన్ని రోజులపాటు నిద్రపోకుండా ఉండగలరు? ఒకటి. రెండు.. లేదా మూడు రోజులు.. అంతకుమించి మీ వల్ల కాదంటారు కదూ! కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 11 రోజులపాటు (264 గంటలు) నిద్రపోకుండా మేల్కొని ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాలిఫోర్నియాలోని శాన్‌డిగోకు చెందిన రాండీ గార్డెనర్ అనే ఓ హైస్కూల్ విద్యార్థి 1964లో తన పదిహేడేళ్ల వయస్సప్పుడు ఈ రికార్డు నెలకొల్పాడు. ఏకధాటిగా 11 రోజుల 24 నిమిషాలపాటు నిద్రపోకుండా ఈ రికార్డు సృష్టించాడు. నిద్రపోకుండా  మేల్కొని ఉండేందుకు అతడు ఎలాంటి ఉత్ప్రేరకాలు వాడలేదు. ఈ సమయంలో వైద్యులు అతడ్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
 
 ఈ క్రమంలో గార్డెనర్ మానసిక స్థితి మారిపోవడం, అలసట వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని మాత్రమే ఎదుర్కొన్నాడు. పదకొండు రోజుల రికార్డు అనంతరం మీడియాతో కూడా అతడు మాట్లాడాడు. ఇతనికంటే ముందు టామ్ రౌండ్స్ పేరిట ఉన్న 260 గంటల రికార్డును గార్డెనర్ చెరిపివేశాడు. రికార్డు అనంతరం కూడా అతడు ఎక్కువ సేపు నిద్రపోలేదు. 14 గంటల 40 నిమిషాలు మాత్రమే నిద్రపోయి తిరిగి ఎప్పటిలాగే ఉదయాన్నే మేల్కొన్నాడు. గార్డెనర్‌కంటే ముందే ఈ విషయంలో పలు రికార్డులున్నా పూర్తి సాంకేతికంగా అందరూ అంగీకరించిన రికార్డు మాత్రం ఆయనదే.
 
 తొలి రికార్డు ఎనిమిది రోజులు..
ఎక్కువకాలం నిద్రపోకుండా రికార్డు సృష్టించిన తొలివ్యక్తి న్యూయార్క్‌కు చెందిన డిస్క్ జాకీ పీటర్ ట్రిప్. ఈయన 1959లో ఏకధాటిగా 8.4 రోజులు (201 గంటలు) పాటు నిద్రపోకుండా రికార్డు నెలకొల్పారు. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్ బిల్డింగ్, హోటల్ రూమ్స్‌తో పాటు వీధుల్లో తిరుగుతూ ఈ ఎనిమిది రోజులూ అతడు నిద్రపోకుండా గడిపాడు. అయితే మూడు రోజుల అనంతరం అతడి ప్రవర్తనలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
 
 ఉన్నట్టుండి బిగ్గరగా నవ్వడం, బాధపడడం, వింతగా ప్రవర్తించడం వంటి విచిత్ర ప్రవర్తనలు ఆయనలో కనిపించాయి. ఎలాగోలా ఈ ఫీట్‌ను పూర్తి చేయగలిగినప్పటికీ, ఎనిమిదో రోజు పూర్తయ్యేసరికి పీటర్ మానసిక స్థితి అదుపుతప్పింది. తదనంతర కాలంలోనూ పూర్తి మానసిక సమస్యల్ని ఎదుర్కొన్నాడు. చివరికి వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇదంతా అతడు ఎనిమిది రోజులపాటు నిద్రపోకుండా ఉండడం వల్లే జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు.
 
 మరికొందరు..

గార్డెనర్ అనంతరం పలువురు ఈ రికార్డును చెరిపేసేందుకు ప్రయత్నించారు. వారిలో 1977లో బ్రిటన్‌కు చెందిన మ్యూరీన్ వెస్టన్ అనే మహిళ ఇలా నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నించింది. 18.7 రోజులు (449 గంటలు) పాటు ఆమె నిద్రపోకుండా యత్నించింది. అయితే దీనికి అధికారికంగా తగిన గుర్తింపు లభించలేదు. అలాగే లాస్‌ఏంజెల్స్‌కు చెందిన టైలర్ షీల్డ్స్ అనే ఫొటోగ్రాఫర్ ఏకంగా నలభై రోజులు (968 గంటలు) నిద్రపోకుండా ఉన్నానని ప్రకటించుకున్నప్పటికీ దీనికి కూడా అధికారిక గుర్తింపు లభించలేదు.
 
 గిన్నిస్ రికార్డుల్లో చోటు లేదు..
 వీరంతా రోజులతరబడి నిద్రపోకుండా రికార్డులు నెలకొల్పినప్పటికీ వీటికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కలేదు. ఎందుకంటే నిద్రపోకపోవడం వల్ల ఎన్నో శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రీయంగా నిరూపణ అయిన అంశం. ఒక్కోసారి ఇది మరణానికి కూడా దారితీయొచ్చు. రికార్డుల్లో చోటు కల్పిస్తే వీటిని అధిగమించి మరింతమంది ఈ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఇది వారికి ప్రమాదకరం. అందుకే ఈ అంశాలకు నిర్వాహకులు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు కల్పించలేదు.
 
 నిద్ర- నిజాలు...
  జపాన్‌లో ఉద్యోగం చేస్తూ ఆఫీస్‌లో నిద్రపోవడాన్ని అనుమతిస్తారు. వారు పనిచేసి అలసటకు గురయ్యారని భావించడమే ఇందుకు కారణం.
  జిరాఫీలు రోజులో 5-30 నిమిషాలు మాత్రమే నిద్రపోగలవు. పిల్లులు తమ జీవితకాలంలో 70 శాతం సమయాన్ని నిద్రపోయేందుకే వెచ్చిస్తాయి.
  రోజుకు ఏడు గంటలకంటే తక్కువ నిద్రపోయేవారి ఆయుర్దాయం తగ్గుతుందట.  మానవులు తమ జీవితకాలంలో సగటున 25 సంవత్సరాలు నిద్రపోతారు.
శిశువుల తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన రెండేళ్లలో దాదాపు ఆరు నెలల కాలానికి సమానమైన నిద్రను కోల్పోతారు. ఎక్కువకాలం సరిగ్గా నిద్రపోని వారు బరువు పెరిగే అవకాశం ఉంది.
నిద్రలేకుండా మానవులు 11రోజులు మాత్రమే జీవించగలరు. నిద్రను అవసరమైనంత సేపు నియంత్రించుకోగల శక్తి క్షీరదజీవుల్లో మానవులకు మాత్రమే ఉంది.
నత్తలు వరుసగా మూడేళ్లపాటు నిద్రపోగలవు. గుర్రాలు నిలబడే నిద్రపోతాయి. కుందేళ్లు కళ్లు తెరచుకొని కూడా నిద్రపోగలవు.

మరిన్ని వార్తలు