సేవా పన్ను ఎగవేతలపై కేంద్రం కొర డా

6 Aug, 2013 02:19 IST|Sakshi
సేవా పన్ను ఎగవేతలపై కేంద్రం కొర డా

న్యూఢిల్లీ/కోల్‌కతా: సేవా పన్ను ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన ఒక కొరియర్ కంపెనీ యజమానిని దాదాపు రూ.70 లక్షల పన్ను ఎగవేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇటువంటి కేసుల్లో కఠిన చర్యలకు అధికారాలు ఇస్తూ చట్టాల్లో సవరణ తీసుకొచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి అరెస్ట్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం పలు రకాల సేవలపై 12.36 శాతం సేవా పన్ను అమలవుతోంది.
 
 కేసు పూర్వాపరాలివీ...: బ్లూబర్డ్ పేరుతో కోల్‌కతాలో కొరియర్ ఏజెన్సీని నిర్వహిస్తున్న సుదీప్ దాస్.. పలు కంపెనీల నుంచి రూ.67 లక్షల మేరకు పన్ను వసూలు చేశారు. అయితే, దీన్ని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో గతవారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ మేరకు కోల్‌కతాలోని సేవా పన్నుల కమిషనర్ కేకే జైస్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దాస్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపారు.
 సేవా పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ)లో నిబంధనల మార్పులకు ఆర్థిక మంత్రి పి. చిదంబరం చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఫైనాన్స్‌బిల్లులో ఈ మేరకు సెక్షన్ 91లో కొత్త నిబంధనను చేర్చి ఆమోదింపజేశారు. దీనిప్రకారం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుల విభాగానికి చెందిన అధికారులకు(సూపరింటెండెంట్ స్థాయికి తక్కువ కాకూడదు) సేవా పన్ను ఎగవేతదారుడిని అరెస్ట్ చేసే అధికారం లభించింది. కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల ఎగవేతలకు ఇప్పటికే సీఆర్‌పీసీ ప్రకారం ఈ కఠిన చర్యలు అమలవుతున్నాయి. ఇప్పుడు సేవా పన్నులకూ ఇది వర్తిస్తుంది. రూ.50 లక్షలు అంతకుమించి సేవాపన్నును ఎగవేస్తే అది శిక్షార్హమైన నేరం కిందికి వస్తుంది. ఈ కేసుల్లో ఎగవేతదారుడికి ఏడేళ్లదాకా జైలు శిక్ష పడొచ్చు.

మరిన్ని వార్తలు