మొండి బకాయిల బండ..!

5 Dec, 2013 01:36 IST|Sakshi
మొండి బకాయిల బండ..!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
పెరుగుతున్న మొండి బకాయిలు బ్యాంకుల మనుగడనే ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. ఆర్థిక మందగమన ప్రభావంతో గత ఐదేళ్ళల్లో బ్యాంకుల్లో మొండి బకాయిలు 400 శాతం పెరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008 మార్చి నాటికి ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల మొండి బకాయిల విలువ రూ.39,030 కోట్లుగా ఉంటే 2013, మార్చినాటికి 397 శాతం పెరిగి రూ.1.94 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ మొత్తంలో రూ.1.64 లక్షల కోట్లు కేవలం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
 
 అంతేకాకుండా ఈ మొండి బకాయిల్లో అత్యధిక భాగం కేవలం కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తుల నుంచే ఏర్పడటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల బకాయిల్లో కేవలం 172 కార్పొరేట్ సంస్థలే రూ.68,000 కోట్లు ఎగ్గొట్టగా, అందులో నాలుగు కంపెనీల వాటా రూ.23,000 కోట్లుగా ఉందన్నారు. అదే కోటికిపైగా రుణం ఎగ్గొట్టిన వారి సంఖ్య 7,295కి చేరింది. మొండి బకాయిల బారిన పడిన  విషయంలో మన రాష్ట్రానికి చెందిన ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లు కూడా ఏమాత్రం తీసిపోలేదు. 2008లో ఆంధ్రాబ్యాంక్ మొండి బకాయిల విలువ రూ.1,798 కోట్ల నుంచి 2013 మార్చి నాటికి రూ.3,714 కోట్లకు చేరితే, ఎస్‌బీహెచ్ బకాయిల విలువ రూ.2,007 కోట్ల నుంచి రూ.3,186 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలపై  ఆందోళన వాస్తవమే అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే కానీ ఇవి తగ్గే అవకాశం లేదని పలు దిగ్గజ బ్యాంకుల సీఎండీలే వ్యాఖ్యానిస్తున్నారు.
 
 సీడీఆర్ మేడిపండే...
 ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్పొరేట్ మొండి బకాయిలను పునర్ వ్యవస్థీకరించి(సీడీఆర్) పుస్తకాల నుంచి ఎన్‌పీఏలను తగ్గిస్తున్నా అది ఆశించినంత ఫలితం ఇవ్వడం లేదు.  ప్రతి ఐదు సీడీఆర్ ఖాతాల్లో ఒకటి ఎన్‌పీఏగా మారుతుండటమే దీనికి నిదర్శనం. క్రితం ఏడాది ప్రతి 15 సీడీఆర్ ఖాతాల్లో ఒకటి మాత్రమే మొండి బకాయిగా మారింది. ఈ ఏడాది సీడీఆర్ విలువ రూ. లక్ష కోట్లు దాటుతుందని అంచనా. ప్రజల కళ్ళకు గంతలు కట్టి మాయచేయడానికే ఈ సీడీఆర్ కాని నిజానికి దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఇంకోపక్క వసూళ్లు కాని మొండి బకాయిలను పుస్తకాల నుంచే తొలగిస్తున్నాయి. పదమూడేళ్లలో భారత్‌లో బ్యాంకులు రూ. లక్ష కోట్ల విలువైన రుణాలను మాఫీ(ఖాతాల నుంచి తొలగింపు) చేసినట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వెల్లడించారు. ఇందులో బడా కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న రుణాల మొత్తమే 95 శాతంగా ఉందని కూడా స్పష్టం చేశారు.
 
 లాభాలు హరీ...
 మొండి బకాయిల  కేటాయింపుల(ప్రొవిజనింగ్)తో బ్యాంకుల లాభదాయకతపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. గడచిన ఐదేళ్ళలో బ్యాంకులు ఈ విధంగా రూ.1.40 లక్షల కోట్ల లాభాలను పోగొట్టుకున్నాయి. మొండి బకాయిల వసూళ్ళపై బ్యాంకుల యాజమాన్యాలు అధికంగా దృష్టిసారించడం లేదని, దీనికి రాజకీయ ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా మారాయని బ్యాంకు అధికారులే పేర్కొంటున్నారు. డెక్కన్ క్రానికల్ రూ.వేల కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉండగా, దీనిపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి పైనుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఒక బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకుల యాజమాన్యాలు రికవరీపై దృష్టిపెట్టడమే కాకుండా ఎగ్గొట్టిన వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు