‘స్మార్ట్’ పరిశ్రమలపై అధ్యయనం

15 Sep, 2015 00:16 IST|Sakshi

రాష్ట్రంలో స్థాపనకు అవకాశాలపై సీఎం కేసీఆర్ చర్చలు
* చైనాలో జెడ్‌టీఈ కంపెనీని పరిశీలించిన బృందం
* హాంగ్‌కాంగ్‌కు బయల్దేరిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొబైల్ తయారీ పరిశ్రమల యూనిట్ల స్థాపనకు అవసరమైన సదుపాయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యయనం చేశారు. చైనాలో పేరొందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ జెడ్‌టీఈ ప్రతినిధులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అక్కడున్న తరహాలో రాష్ట్రంలోనూ స్మార్ట్ ఫోన్ల విడిభాగాల తయారీకి ఎలాంటి సదుపాయాలు అవసరం, ఏయే రాయితీలు కల్పించాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. షెంజెన్ నగరంలో ఉన్న జెడ్‌టీఈ మొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమను ఆయన స్వయంగా సందర్శించారు. జెడ్‌టీఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో టాప్ టెన్‌లో ఉండగా.. చైనా మొబైల్ మార్కెట్‌లో మొదటి అయిదు స్థానాల్లో ఉంది. విడి భాగాల తయారీతో పాటు టెలీ కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ రంగంలో  జెడ్‌టీఈకి ప్రత్యేక గుర్తింపు ఉంది.  పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో చైనా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎనిమిదో రోజున షెంజెన్ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
అద్భుతమైన హైటెక్ పార్కు
తన బృందంతో కలిసి కేసీఆర్ ఉదయాన్నే షెంజెన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. అక్కడే ఉన్న జెడ్‌టీఈ మొబైల్ తయారీ యూనిట్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీష్‌రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తో పాటు అధికారులు ఉన్నారు. చైనాలో ఉన్న అయిదు స్టేట్ లెవల్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్కుల్లో షెంజెన్‌కు ప్రత్యేకత ఉంది.

1996లో వెలిసిన ఈ పార్కు అద్భుతంగా ఉందని, పరిశ్రమలకు సకల సదుపాయాలున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 11.5 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు పెట్టుబడిదారులను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. ఐబీఎం, ఫిలిప్స్, కాంపాక్, ఒలింపస్, ఎప్సన్, లుసెంట్, హరీస్ అండ్ థామ్సన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలను ఈ పార్కు ఆకర్షించిందని సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

కేవలం పరిశ్రమల స్థాపన కేంద్రంగా కాకుండా అన్ని రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల ఆధ్వర్యంలో శాస్త్రీయ పరిశోధన కేంద్రాలు ఇక్కడే అందుబాటులో ఉండటం అందరినీ ఆకట్టుకుంది. ప్రధానంగా కంప్యూటర్, టెలీ కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్, బయోలాజికల్ ఇంజనీరింగ్ రంగాల్లో అభివృద్ధిపై ఈ పార్కు యాజమాన్యం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. పార్కు సందర్శన సమయంలో అక్కడున్న వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి ముచ్చటించారు.

ఇండస్ట్రియల్ పార్కులో సదుపాయాలు, రాయితీలతో పాటు కొత్త పరిశ్రమల స్థాపన, వాటి నిర్వహణ వ్యవహారాలపై చర్చించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనువైన అవకాశాలున్నాయని వివరించారు. ఇండస్ట్రియల్ పార్కు సందర్శన అనంతరం సీఎం బృందం సోమవారం మధ్యాహ్నం షెంజెన్ నుంచి హాంగ్‌కాంగ్‌కు బయల్దేరింది.
 
పెట్టుబడులకు అనుకూలం
చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (సీసీపీఐటీ) ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం సమావేశమైంది. అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య అంశాలపై రెండు బృందాలు తమ అభిప్రాయాలు  పంచుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమల స్థాపనకు పుష్కలమైన అవకాశాలున్నాయని చెప్పారు.

కొత్తగా అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉందని వివరించారు. వివిధ దేశాలతో వాణిజ్య సహకార సంబంధాలు పెంపొందించేందుకు చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో సీసీపీఐటీ పని చేస్తుంది.

మరిన్ని వార్తలు