అయ్యో! ప్లూటో తునాతునకలైంది..

24 Jan, 2017 14:19 IST|Sakshi



రాయ్‌పూర్‌:
అడవుల్లో నక్సలైట్ల కోసం జరిగే కూంబింగ్‌ ఆపరేషన్లలో చురుకుగా వ్యవహరించి, పలు జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకున్న స్నిఫర్‌ డాగ్‌ ప్లూటో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. సీఆర్పీఎఫ్‌ 229వ బెటాలియన్‌కు చెందిన ఈ శునకం నక్సల్స్‌ అమర్చిన మందుపాతరపై పొరపాటున కాలేసి తునాతునకలైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

స్నిఫర్‌ డాగ్‌ ప్లూటోను వెంటబెట్టుకుని సీఆర్పీఎఫ్‌ జవాన్లు కొందరు.. సోమవారం రాత్రి తిమ్మాపూర్‌-ముర్దాండల మధ్య గల అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యరాత్రి తర్వాత నక్సల్స్‌ కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మంగళవారం ఉదయానికి సీఆర్పీఎఫ్‌ బృందం ముర్దాండ సమీపానికి చేరుకుంది. జవాన్లకంటే ముందే నడుస్తూ వెళ్లిన ప్లూటో.. దారి మధ్యలో నక్సల్స్‌ అమర్చిన మందుపాతరను గుర్తించి అరవసాగింది. ఈ క్రమంలో పొరపాటున దానికాలు మందుపాతరపై పడటంతో పేలుడు సంభవించింది.

కాగా, ఈ ఘటనలో జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ప్లూటో మరణం తమ బెటాలియన్‌కు తీరని నష్టమని సీఆర్పీఎఫ్‌ దిగ్భాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్లూటో విన్యానాలకు సంబంధించిన ఫొటోలను సీఆర్పీఎఫ్‌ అధికారిక ట్విట్టర్‌ పేజీలో షేర్‌చేశారు.




మరిన్ని వార్తలు