‘బ్లాక్‌ ఫేస్’పై పెనుదుమారం

9 Jun, 2017 20:18 IST|Sakshi


అనగనగా ఓ యువరాజు. రోజూ తన కలలోకి వచ్చే ప్రేయసి ఎవరో తెలుసుకోవడానికి దేశంలోని యువతులను దర్బారుకు పిలిపిస్తాడు. అక్కడికొచ్చిన అమ్మాయిలంతా ఆటాపాటలతో ప్రిన్స్‌ను అలరిస్తారు. చివరగా ఓ అమ్మాయి పాడిన పాటకు అతను ముగ్ధుడైపోతాడు.

‘నువ్వే నా కలల రాణివి’అని ఉప్పొంగుతూ ముఖం మీద ముసుగును తీసెయ్యమంటాడు. ఆమె ముసుగు తీస్తుంది. నల్లటి ముఖాన్ని చూసి యువరాజు గావుకేకపెడతాడు. కొద్దిసేపటితర్వాత అవే దుస్తుల్లో ఓ సుందరి ప్రత్యక్షం అవుతుంది. ‘నేను నల్లదాన్ని కాను.. స్వచ్ఛమైన అందగత్తెని. నీ(యువరాజు) నిజాయితీని పరీక్షించడానికే అలా వచ్చా’నని అతని కౌగిట్లో ఒదిగిపోతుంది.

ఇదీ.. ప్రఖ్యాత బ్యూటీకేర్‌ సంస్థ ‘వాట్సన్‌ మలేసియా’  ఇటీవల రూపొందించిన ప్రకటన(యాడ్‌). 14 నిమిషాల నిడివితో రూపొందింన ‘బ్లాక్‌ ఫేస్‌’ ప్రకటనను వాట్సన్‌ సంస్థ గురువారం ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసింది. గంటల వ్యవధిలోనే వైరల్‌ అయింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పెనుదుమారమూ రేపింది. ‘ఈ ప్రకటన జాతివిక్షకు పరాకాష్ట. ఇన్నాళ్లూ వాట్సన్‌ ఉత్పత్తులు వాడినందుకు సిగ్గుపడుతున్నా’అని కొందరు.. ‘నల్లగా ఉండటాన్ని లోపంగా చూపిన మీరు నిజంగా చీకట్లో బతుకుతున్నారు’ అని ఇంకొందరు వాట్సన్‌ సంస్థను ఛీకొట్టారు. అన్ని వర్గాల నుంచి ఛీత్కారాలు ఎదురుకావడంతో వెనక్కితగ్గిన వాట్సన్‌ మలేసియా.. ఎట్టకేలకు వీడియోను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

4వేలకుపైగా పర్సనల్‌ కేర్‌ స్టోర్లు, వెయ్యికిపైగా ఫార్మసీలు కలిగిన వాట్సన్‌ మలేసియా ఆసియా ఖండంలోని అతిపెద్ద బ్యూటీకేర్‌ సంస్థల్లో ఒకటి. చైనా, కొరియా, ఉక్రెయిన్‌లలో ఈ సంస్థ చాలా పాపులర్‌. ఇప్పటి బ్లాక్‌ ఫేస్‌ లాగే గత ఏడాది ఓ మలేసియా టీవీ చానెల్‌.. నలుపు రంగు మనుషుల్ని అవమానించేలా ఉన్న స్కిట్‌ను ప్రసారం చేసి అభాసుపాలైంది.

మరిన్ని వార్తలు