భారత ‘బోర్డర్‌’లో సంచలనాలు

13 Jan, 2017 07:47 IST|Sakshi
భారత ‘బోర్డర్‌’లో సంచలనాలు

శ్రీనగర్‌: భారతదేశ సరిహద్దుల్లో మొదటి రక్షణ వలయమైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)కు చీడ పట్టుకుంది. గొప్ప పేరుప్రతిష్ఠలున్న ఆ విభాగాన్ని కొందరు అధికారులు గబ్బుపట్టిస్తున్నారు. ఎండనకా వాననకా కాపలా కాస్తోన్న జవాన్లకు అందాల్సిన బలవర్ధక ఆహారపదార్థాలను నల్ల బజారులో అమ్ముకుంటున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్‌ 29వ బెటాలియన్‌ జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేసిన వీడియో దుమారం చల్లారకముందే, బీఎస్‌ఎఫ్‌లో అక్రమాలపై మరికొన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర హోం శాఖ స్పందించకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(డ్యూటీలో అతనికి మొబైల్‌ఫోన్‌ ఎక్కడిది?)

జమ్ముకశ్మీర్‌లోనే అతి ప్రధానమైన హుంహమా బీఎస్‌ఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మీడియా సంస్థలు చేపట్టిన పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హుంహమా క్యాంపు చుట్టూ ఉండే నివాస ప్రాంతాల్లో కొన్ని దుకాణాలన్నాయి. ఆ దుకాణదారులతో బీఎస్‌ఎఫ్‌కు చెందిన కొందరు అధికారులు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ గోడౌన్ల నుంచి క్యాంప్‌కు వచ్చే పప్పులు, ఇతర సరుకులు, కూరగాయల్లో కొంత భాగాన్నిఅధికారులు.. ప్రైవేటు దుకాణాలకు మళ్లిస్తారు. ‘మార్కెట్‌ ధరలతో పోల్చుకుంటే బీఎస్‌ఎఫ్‌ వాళ్లు మాకు తక్కువ ధరకే సరుకులు ఇస్తారు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని దుకాణందారుడు మీడియాతో అన్నాడు.

అందినకాడికి దోచుడే..
హుంహమా బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ పక్కనే నివసించే ఓ కాంట్రాక్టర్‌ ఇలా చెప్పాడు..‘మా వాహనాలకు అవసరమైన పెట్రోల్‌, డీజిల్‌ ను బీఎస్‌ఎఫ్‌ ఆఫీసర్ల నుంచే కొనుక్కుంటాం. బంక్‌ ధర కంటే తక్కువకే ఇస్తారు’అని! కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్‌ కొనుగోళ్లలోనూ ఈ అక్రమ అధికారులు చేతివాటం చూపెడతారు. ‘ఫర్నీచర్‌ నాణ్యత తగ్గినా ఫర్వాలేదు.. మా కమీషన్‌ మాకు దక్కాల్సిందే’అని బీఎస్ఎఫ్‌ అధికారులు తనతో అన్నట్లు ఓ కర్పెంటర్‌ వెల్లడించాడు.
(బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ షాకింగ్‌ వీడియో)

డిజిటల్‌ మోదీ.. ‘భద్రత’లో ‘ఈ’ లేమి!
ఒకవైపు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం మొత్తాన్ని డిజిటలైజ్‌ అయిపోతున్న(!) తరుణంలో బీఎస్‌ఎఫ్‌ లాంటి కీలక భద్రతా దళంలో కనీసం ‘ఈ-టెండర్‌’ వ్యవస్థ కూడా లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. క్యాంపులో ఉండే జవాన్లు, అధికారులకు ఎంత మొత్తంలో సరుకులు అవసరం ఉంటుంది? ఎంత పంపిణీ అవుతోంది? వినియోగం ఎంత? పక్కదారి పట్టేదెంత? తదితర వివరాలును పకడ్బందీగా నమోదుచేసి, పర్యవేక్షించే డిజిటల్‌ వ్యవస్థ ఏదీ బీఎస్‌ఎఫ్‌లో లేకపోవడం గమనార్హం.

బీఎస్‌ఎఫ్‌ ఒక్కటేకాదు..
ఒక్క బీఎస్‌ఎఫ్‌లోనేకాదు కీలకమైన మరో నాలుగు (సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ) భద్రతా దళాల్లోనూ అప్పుడప్పుడూ అక్రమాల మాట వినిపిస్తుంటుంది. కానీ  ఈస్థాయిలో(‘జవాన్‌ వీడియో’) ఏనాడూ వెలుగులోకి రాలేదు. ఈ అంశంపై శ్రీనగర్‌ సీఆర్‌పీఎఫ్‌ ఐజీ(అడ్మినిస్ట్రేషన్‌) రవీందర్‌ సింగ్‌ సాహి స్పందిస్తూ.. జవాన్లకు దక్కాల్సిన సరుకులు నల్ల బజారుకు తరలించడం దారుణమన్నారు. బీఎస్‌ఎఫ్‌తో పోల్చుకుంటే సీఆర్‌పీఎఫ్‌లో సరుకుల కొనుగోళ్లుకు నిర్ధిష్టయంత్రాంగాన్ని రూపొందించామన్నారు.

మరిన్ని వార్తలు