ఢిల్లీ చేరుకున్న సోనియాగాంధీ

11 Sep, 2013 10:25 IST|Sakshi
ఢిల్లీ చేరుకున్న సోనియాగాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.  వైద్య పరీక్షల నిమిత్తం ఆమె ఈ నెల 2న అమెరికా వెళ్లారు.  2011, ఆగస్టు 5న సోనియాకు అమెరికాలో శస్త్ర చికిత్స జరగడం తెలిసిందే. కాగా గత నెల ఆగస్టులో ఆహార బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంలో తీవ్ర అలసట, ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన సోనియాను  ఎయిమ్స్‌కు తరలించారు.

తర్వాత, సెప్టెంబర్ 2న ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు.  ఏకే ఆంటోనీ నేడు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. కాగా రాష్ట్రవిభజనపై కేబినెట్ నోట్ సిద్దమైందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్న విషయం తెలిసిందే. కేబినేట్ నోట్ తో తాము సిద్ధంగా ఉన్నామని.. సోనియాగాంధీ రాగానే రాజకీయ పార్టీల ఆమోదానికి పంపుతామని  ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

కాగా చికిత్స కోసం అమెరికా వెళ్లిన  సోనియాగాంధీకి కొత్త చిక్కులు వచ్చాయి. 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (ఎస్.ఎఫ్.జె.) అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుతో అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. 1984 నవంబర్ నెలలో సిక్కులపై జరిగిన దాడులలో కొందరు పార్టీ నాయకుల హస్తం ఉండగా.. వారికి సోనియా అండదండలు అందిస్తున్నారంటూ వారు తమ పిటిషన్లో ఆరోపించారు. న్యూయార్క్లోని తూర్పు జిల్లా కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.

 ఎస్.ఎఫ్.జె.తో పాటు ఇతర సిక్కు మానవహక్కుల బృందాలు కూడా ఈ పిటిషన్ దాఖలు చేశాయి. ఫెడరల్ నిబంధనల ప్రకారం సోనియాగాంధీకి సమన్లు అందజేసేందుకు తమకు 120 రోజుల గడువు ఉంటుందని ఎస్.ఎఫ్.జె. తరఫున వాదించే న్యాయవాది గుర్పత్వంత్ ఎస్. పన్నున్ తెలిపిన విషయం తెలిసిందే. సోనియాకు హాస్పటల్లో సమన్లు అందచేసినట్లు సిఖ్స్ గ్రూప్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు