ఇక రూ.10కే డేటా సర్వీసులు

22 Apr, 2017 16:55 IST|Sakshi
ఇక రూ.10కే డేటా సర్వీసులు

న్యూఢిల్లీ :  అతి తక్కువ ధరకే డేటా సేవలను  ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు  కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది.   ప్రత్యేకగా  రూపొందించిన వై ఫై హాట్‌ స్పాట్‌ ల ద్వారా  రూ.10ల కంటే తక్కువ ధరకే ఈ సేవలను అందించనుంది.   ఈ  నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ  సెంటర్‌ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌(సీ-డాట్‌) అభివృద్ధి చేసిన పబ్లిక్‌ డాటా ఆఫీస్(పీడీవో)ను టెలికాం శాఖామంత్రి మనోజ్‌సిన్హా శుక్రవారం ప్రారంభించారు. సీ-డాట్‌ పీడీఓ టెక్నాలజీని 2-3 నెలల్లోనే దేశీయ తయారీదారులకు అందించాలని భావిస్తున్నట్టు  ఆయన చెప్పారు.   

సెల్‌ఫోన్‌ లేని కాలంలో పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌లను వినియోగించుకున్నట్టుగా డేటా ప్యాక్‌లను వినియోగించుకోవచ్చు. పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ల మాదిరిగా త్వరలో పబ్లిక్‌ డేటా ప్యాక్‌ల బూత్‌లు  రాబోతున్నాయి.  ఈ బూత్‌ల ద్వారా మొబైల్‌ ఫోను వినియోగదారులకు చౌకగా వై-ఫై సేవలు అందుబాటులోకి  రానున్నాయి. ఈ సేవలను కిరాణా స్టోర్స్‌, చిల్లర దుకాణలు, తోపుడు బండ్ల ద్వారా సైతం అందించే వెసులుబాటు ఉందని సిన్హా తెలియజేశారు.  పీడీవో నుంచి 2జీ, 3జీ, 4జీ సిగ్నల్స్‌ ద్వారా  వై-ఫై హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసి 500 మీటర్ల పరిధిలో  ఏకకాలం‍లో వం‍ద మొబైళ్లకు నెట్‌ కనెక్ట్‌ చేసుకోవచ్చు.   అంతేకాదు ప్రస్తుతం ఉన్న మొబైల్‌ టవర్స్‌ ద్వారా  కూడా ఈ  సేవలను అందించే సౌలభ్యం ఉందని తెలిపారు.  

ప్రస్తుతం డిజిటల్ ఇండియా, దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి లేని కారణంగా పీడీవోతో తక్కువ ధరకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను మూలమూలల విస్తరించవచ్చని సీడీఓటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపిన్ త్యాగి చెప్పారు. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవడానికి  అమితాసక్తిగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో దీనికి భారీ సంఖ్యలో అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే జనరల్‌ రీటైలర్స్‌ కోసం టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌తో సంప్రదింపులపై దృష్టిపెట్టినట్టు ఆయన తెలిపారు. సుమారు 50వేల యూనిట్లను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు.  తద్వారా 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఈ డేటా సర్వీసులను కొనుక్కోవచ్చని పేర్కొన్నారు.  

 

మరిన్ని వార్తలు