త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు

13 Aug, 2015 01:44 IST|Sakshi

అధికారులకు సీఎం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. వెబ్ ఆధారితంగా బదిలీలు చేయాలని సీఎం సూచించారని, ఈ మేరకు త్వరలోనే విధివిధానాలు, షెడ్యూల్ విడుదలవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రతిభ, పనితీరు, ఫలితాల ఆధారంగా బదిలీలు జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు నెల రోజుల్లో ల్యాప్‌టాప్‌లు అందించాలన్నారు. ఫలితాల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలని వెల్లడించారు.
 
రాష్ట్రంలో వంద శాతం స్వచ్ఛ విద్యాలయాలు
ప్రధానమంత్రి న రేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ విద్యాలయాల లక్ష్యాన్ని రాష్ట్రంలో వందశాతం పూర్తి చేశామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు.
 
షెడ్యూల్ విడుదల చేయాలి: ఎస్టీయూ

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తి నరసింహారెడ్డి, సుధీర్‌బాబు బుధవారం ఓ ప్రక టనలో ప్రభుత్వాన్ని కోరారు.

>
మరిన్ని వార్తలు