త్వరలోనే ఆన్‌లైన్‌లోకి మరో 7 వేల టికెట్లు

19 Oct, 2014 00:52 IST|Sakshi
త్వరలోనే ఆన్‌లైన్‌లోకి మరో 7 వేల టికెట్లు

* దివ్యదర్శనం, సర్వదర్శనానికి టైంస్లాట్
* సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
* టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు

సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ టికెట్ల విధానం విజయవంతంగా కొనసాగుతోందని, దీనికి మరో 7 వేల టికెట్లను అనుసంధానం చేస్తామని టీటీడీ జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు చెప్పారు. తిరుమలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 వేల టికెట్లను ఆన్‌లైన్ లోకి మళ్లించాక తిరుమలలో కరెంట్ బుకింగ్ ఉండదన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దర్శనంలో మార్పులు చేస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా సర్వదర్శనం కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్ణీత సమయం ప్రకారం టికెట్లు కేటాయించి స్వామి దర్శనం కల్పిస్తామని చెప్పారు. కాలిబాటల్లో వచ్చే భక్తులను సైతం రోజులో పరిమిత సంఖ్యలోనే దర్శనానికి అనుమతించేందుకు వీలుగా టికెట్లపై నిర్ణీత సమయం కేటాయిస్తామన్నారు. రాబోయే రెండు నెలల్లో దాదాపు అన్ని రకాల దర్శనాల్లోనూ మార్పులు వస్తాయని తెలిపారు. టీటీడీ నిబంధనల ప్రకారం రూ.300 ఆన్‌లైన్ టికెట్ల భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని చెప్పారు. ఫ్యాంటుపై పంచె కట్టుకుంటే అనుమతించేది లేదన్నారు. భక్తులు కూడా టీటీడీకి సంపూర్ణంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు