లౌకికవాదం ఓ ముసుగు

3 Mar, 2014 04:03 IST|Sakshi
లౌకికవాదం ఓ ముసుగు

కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ
 
లక్నో: కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లపై బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి లౌకికవాదం అనే ముసుగు ధరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. ‘‘నిరుద్యోగం, సాగునీరు, ధరల పెరుగుదల, పేదరికం, కనీసం.. బడిలో పిల్లల అడ్మిషన్ల గురించి ప్రజలు అడుగుదామన్నా.. ఈ పార్టీలు పట్టించుకోవు. వారు చెప్పేదొకటే.. ‘వీటన్నింటినీ పక్కన పెట్టండి... వీటికంటే ముందు లౌకికవాదానికి ముప్పు పొంచి ఉంది. దాని గురించి మాట్లాడండి’ అని అంటారు.. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటారు’’ అని అన్నారు. ఆయన ఆదివారం లక్నోలో భారీ స్థాయిలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు.వివరాలు ఆయన మాటల్లోనే..
    ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు.. లౌకికవాదం అన్న పదాన్ని ఒక ఎన్నికల నినాదంగా, ఆధికారాన్ని చేజిక్కించే పనిముట్టుగా వాడుకుంటున్నా యి. కానీ బీజేపీ విషయంలో లౌకికవాదం అంటే.. ప్రజలను ఐక్యం చేయడం, వారికి అభివృద్ధిని అందించడం. ఎన్నికల వేడి ఇంకా రగలకముందే.. బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక వాటి (ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) వినాశనం తప్పదు.
     ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ ఏడాది పాలనలో యూపీలో 150కిపైగా అల్లర్లు జరిగాయి. అదే గుజరాత్‌లో అయితే గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదు. కనీసం కర్ఫ్యూ కూడా విధించలేదు. మరి యూపీ లో అంతలా అల్లర్లు జరగడానికి కారణమేంటో నేతాజీ(ములాయంనుద్దేశించి) చెప్పాలి. అభివృద్ధి విషయంలో గుజరాత్‌ను, యూపీని పోల్చకండి.
     యూపీలో శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయి. దేశంలోని నేరాల్లో 45 శాతం ములాయం కళ్లెదుటే జరిగాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి ఒక్క యూపీలోనే 20 వేల కేసులు నమోదయ్యాయి. కాన్పూర్‌లో అయితే ఎమ్మెల్యే అనుచరులు వైద్య విద్యార్థులపై దౌర్జన్యం చేయడంతో వారు ఆందోళనకు దిగారు కూడా. ఈ గూండాగిరీ రాజకీయాలను ఇక సహించేది లేదు.
     నా ర్యాలీలకొచ్చే జనం విషయంలో తాము పోటీపడలేమంటూ ఈ రోజు నేతాజీ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లకు ఆయన కూడా అభివృద్ధి గురించి మాట్లాడేలా మేం చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.
     ములాయం ఊరికే మా రాష్ట్రంలో అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు నాదో విన్నపం. ఒకసారి గుజరాత్ వచ్చి చూడండి. అక్క డ 365 రోజులూ 24 గంటలపాటు కరెంటు ఉం టుంది. అదే యూపీలో నేతాజీ ఉన్న ప్రాంతాల్లో కరెంటు ఉంటుంది.. మిగతా చోట్ల ఉండదు. ము లాయం ఇకనైనా యూపీకేం చేశారో చెబితే మేలు.
 ఆ ఘనత బీజేపీదే: నేను వెనుకబడిన వర్గం నుంచి వచ్చాను. పేదరికంలో పెరిగిన నన్ను, టీ అమ్ముకుని బతికిన నన్ను.. ప్రధాని అభ్యర్థిని చేసిన ఘనత బీజేపీది మాత్రమే. దేశంలో మరే ఇతర పార్టీ ఇలా చేయదు. వచ్చే పదేళ్లూ వెనుకబడిన వర్గాలకు, దళితులకు, పేదలకు చాలా కీలకం. వారి జీవితాల్లో మార్పు రాబోతోంది. ఢిల్లీ ఖజానాకు నేను కాపలాదారుగా ఉండబోతున్నాను. దానిపై ఇక ఎవరూ చేయి( కాంగ్రెస్ గుర్తు) వేయలేరు. సైకిల్(ఎస్పీ గుర్తు) తొక్కేవారైనా, ఏనుగుపై(బీఎస్పీ గుర్తు) వచ్చే వారైనా.. ఎవరూ అందులో చేయి పెట్టలేరు.
 
 మూడో కూటమి ప్రయోగంతో దేశానికి నష్టం
 న్యూఢిల్లీ: ‘‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోగలిగే ప్రభుత్వం దేశానికి అవసరం. ఇలాంటి సమయంలో మూడో కూటమి ప్రయోగం అంటే.. దాని వల్ల దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని నరేంద్ర మోడీ.. దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కడతామంటున్న పార్టీలు.. ఏదో ఒక సమయంలో రాజకీయ అవకాశవాదం వల్ల ఆ పార్టీతోనే చేతులు కలుపుతున్నాయన్నారు.
 
మోడీ ర్యాలీలకు డబ్బులెక్కడివి: కాంగ్రెస్
మోడీ యూపీలోను, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ చేపట్టిన ‘విజయ్ శంఖానాద్’ ర్యాలీలకు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ ప్రశ్నిం చింది. ‘ఈ రోజు(ఆదివారం) మోడీ ర్యాలీ కోసం 29 రైళ్లు ఏర్పాటు చేశారు. వాటికి రూ.5 కోట్లు ఖర్చవుతుంది. అలాగే 5వేల బస్సులు, 15 వేల జీపులు, లాడ్జింగ్, ఆహారం, డెకరేషన్ తదితర ఖర్చులు కూడా కలుపుకొంటే మొత్తం రూ.40 కోట్లు దాటుతుంది. ఈ డబ్బు ఎక్కడిదో బీజేపీ చెప్పాలి’ అని ప్రశ్నించింది.
 

>
మరిన్ని వార్తలు