సురక్షితంగా భూమిని చేరిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక

20 Mar, 2017 22:39 IST|Sakshi
సురక్షితంగా భూమిని చేరిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక

వాషింగ్టన్‌: అంతరిక్షంలోని వ్యోమగాములకు అవసరమయ్యే వస్తువులు, ఆహారాన్ని మోసుకెళ్లిన స్పేస్‌ ఎక్స్‌ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, తిరిగి భూమిని (పసిఫిక్‌ మహాసముద్రంలోని లాంచ్‌ ప్యాడ్‌) చేరింది. ఈ విషయాన్ని స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాముల పరిశోధనకు అవసరమయ్యే ప్రతి చిన్న వస్తువును భూమిపై నుంచే పంపాలి. ఇప్పటిదాకా రాకెట్లు ఈ పనిని నిర్వర్తిస్తుండగా.. అవి తిరిగి భూమిని చేరే అవకాశం లేదు.

దీంతో వీటి తయారీ ఖర్చు భారీగా పెరిగి పోతోంది. దీనికి పరిష్కారంగా స్పేస్‌ ఎక్స్‌ పునఃవినియోగ సామర్థ్యం కలిగిన రాకెట్లను రూపొం దించింది. గతంలో అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌ను భూమిపైకి దింపడంలో పలుమార్లు విఫలమైన స్పేస్‌ ఎక్స్‌ కొంతకాలంగా వరుసగా సఫలీ కృతమవుతోంది. ఈ ప్రయత్నంలోభాగంగానే గతనెల 23వ తేదీన అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక అక్కడి వ్యోమగాముల కోసం అవసరమైన వస్తువులు తీసుకెళ్లడమే కాకుండా అంతరిక్షం నుంచి దాదాపు 4,000 పౌండ్ల బరువైన పరిశోధన నమూనాలను, అంతరిక్ష వ్యర్థాలను తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు