చనిపోనివ్వాలంటూ మోదీకి లేఖ

25 Sep, 2016 18:28 IST|Sakshi
చనిపోనివ్వాలంటూ మోదీకి లేఖ

భోపాల్: దివ్యాంగులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ వైపు మాట్లాడుతుండగా.. సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ చదివినా తనకు ఉద్యోగం దొరకలేదని భోపాల్ కు చెందిన లక్ష్మీ యాదవ్ అనే దివ్యాంగురాలు ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో)కు ఉత్తరం రాసింది.

గత పదేళ్లుగా ప్రైవేటు ఉద్యోగం కోసం తిరిగినా దివ్యాంగురాలిననే కారణంతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదని, దయచేసి చనిపోయేందుకు అనుమతించాలని లేఖలో కోరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లకు కూడా లక్ష్మీ లేఖలు రాసింది.

లేఖలోని విషయాలు:
గత 12 ఏళ్లుగా ఎంఫిల్, ఎల్ఎల్ఎమ్ డిగ్రీలు చేత పట్టుకుని కంపెనీల ఇంటర్వూలకు ఉద్యోగం కోసం తిరిగినట్లు లక్ష్మీ లేఖలో పేర్కొంది. దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు సంశయించాయని ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలకు చాలా పథకాలు ప్రారంభించిందని పేర్కొంది. ప్రైవేటు కంపెనీల్లో ఇంటర్వూలకు వెళ్లిన ప్రతిసారీ చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పింది.

మెట్లు ఎక్కలేనని, సరిగా పనిచేయగలిగే సామర్ధ్యం ఉందా? లాంటి కారణాలతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదని తెలిపింది. అవకాశం ఇస్తేనే కదా తన సామర్ధ్యం తెలిసేదని లక్ష్మీ లేఖలో వాపోయింది. ఉద్యోగం రాని జీవితం తనకు వద్దని చనిపోవడానికి అవకాశం కల్పించాలని లేఖలో కోరింది.

మరిన్ని వార్తలు