'ఉమ్మేసి పారిపోవడం రాహుల్ విధానం'

14 Aug, 2015 18:38 IST|Sakshi
'ఉమ్మేసి పారిపోవడం రాహుల్ విధానం'

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శల స్థాయిని మరింత పెంచింది. ఉమ్మేసి పారిపోవడం, ఢీకొట్టి పారిపోవడం రాహుల్ గాంధీ రాజకీయ విధానాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ కోసం ర్యాలీ నిర్వహించిన మాజీ మిలటరీ అధికారులకు రాహుల్ తన మద్ధతు తెలిపి అనంతరం బీజేపీ విమర్శలు చేయడంపట్ల స్పందిస్తూ రవిశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఓపక్క రాహుల్ పార్టీ నడుపుతున్న విధానంపై ఆ పార్టీలోని ఎందరో సీనియర్ నేతలు పెదవి విరుస్తుండగా.. కొంతకాలం తర్వాత పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారని విమర్శించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, సమస్యను పరిష్కరించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్యాకేజీ, రిప్యాకేజీ ఇచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నించారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు రాహుల్కు వెంటనే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని పెద్ద స్థాయిలో గొంతెత్తి నినదిస్తే ఈరోజు అలా నినదించేవారి సంఖ్య తగ్గిందని అన్నారు.

మరిన్ని వార్తలు