ఔత్సాహికుల కోసం టై సదస్సు

14 Dec, 2013 02:53 IST|Sakshi
ఔత్సాహికుల కోసం టై సదస్సు

సాక్షి, హైదరాబాద్: ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒకచోట చేరుస్తూ అతిపెద్ద సదస్సు నిర్వహించడానికి ‘ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టై)’ సిద్ధమయింది. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు హెచ్‌ఐసీసీలో జరిగే ఈ సదస్సులో ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొంటారని టై హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు మురళి బుక్కపట్నం, టై సదస్సు కన్వీనర్ అనంతరావు తెలియజేశారు.
 
 ఈ వెంచర్ క్యాపిటలిస్టులలో హెలియాన్ వెంచర్ పార్ట్‌నర్, యాక్సెల్ పార్ట్‌నర్స్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, టీవీఎస్ క్యాపిటల్, కాలరి క్యాపిటల్, వెంచర్‌ఈస్ట్, పీపుల్ క్యాపిటల్, యునిలేజర్ వెంచర్స్, శ్రీ క్యాపిటల్, ఇండియన్ ఏంజిల్ నెట్‌వర్క్ తదితర సంస్థలున్నట్లు వారు తెలియజేశారు. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు ఏకకాలంలో తెలుసుకోవటానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ‘‘ఆలోచనలు కంపెనీ ఏర్పాటు స్థాయికెళ్లాలి. కంపెనీ ఏర్పాటయ్యాక ఫండింగ్ రావాలి. ఫండింగ్ వచ్చాక విస్తరణ జరగాలి. ఆ తరవాత బయటపడాలి. అక్కడి నుంచి సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి. అన్నిటికన్నా ప్రధానమైనది, ఎక్కువ అడ్డంకులు ఎదురయ్యేది ఒక ఐడియాను కంపెనీగా మార్చడం, దానికి తగ్గ ఆర్థిక వనరులను సంపాదించడమే. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవటమే ప్రధానంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం’’ అని మురళి వివరించారు. కాగా, ఇన్వెస్టర్లు ఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారో కూడా అర్థం చేసుకోవచ్చని అనంతరావు తెలియజేశారు.
 
 నిజానికి సిలికాన్ వ్యాలీలో విజయపతాకం ఎగురవేసిన భారతీయ సంతతి వ్యాపారులు మరింత మందిని తమలా తీర్చిదిద్దేందుకు ఈ ై‘టె’ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 61 చాప్టర్లు, 15,000 మంది సభ్యులతో విస్తరించిన ఈ సంస్థకు భారత్‌లో 17 చాప్టర్లున్నాయి. తాజా సదస్సులో అపోలో గ్రూపు సంస్థల చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, మైహోమ్ గ్రూప్ సంస్థల చైర్మన్ జే రామేశ్వరరావు, సినీ నిర్మాత రోనీ స్క్రూవాలా ప్రభృతులు పాల్గొంటారు. తాము  ఎదుర్కొన్న ఆటుపోట్లను,  అధిగమించిన తీరును వివరిస్తారు. సదస్సులో పాల్గొనాలనుకునేవారు http://www.tiesummit.com ద్వారా సంప్రతించవచ్చని నిర్వాహకులు చెప్పారు.

మరిన్ని వార్తలు