మెషిన్ల జీవితకాలం పెంచే నానో లూబ్రికెంట్లు

20 Jun, 2014 14:35 IST|Sakshi

చెన్నై: గేర్‌బాక్సుల్లాంటి మెషిన్లలో లోహాల మధ్య ఘర్షణను గణనీయంగా తగ్గించే కొత్త తరహా నానో (మరగుజ్జు) లూబ్రికెంట్‌ను ఇక్కడి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కందెన(లూబ్రికెంట్) గొప్ప ప్రమాణాలను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించిన సుబ్రజిత్ భౌమిక్ చెప్పారు. ఈ కందెనతో లోహాల అరుగుదలలో 30 శాతం తగ్గుదల ఉంటుందని, లోడ్‌ను భరించే శక్తిలో 15 శాతం పెరుగుదల ఉంటుందని చెప్పారు.

సంపూర్ణ మినరల్ ఆయిల్, మినరల్ ఆయిల్ + గ్రాఫైట్‌లతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన కందెనలో ఘర్షణను తక్కువచేసే శక్తిని గుర్తించామన్నారు. లోహాల అరుగుదలను తగ్గించి వాటి జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని భౌమిక్ తెలిపారు. నానో లూబ్రికెంట్స్‌తో ఇంజిన్ ఆయిల్ వినియోగం, శక్తి వినియోగం తగ్గుతుందని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ రీసెర్చ్ డెరెక్టర్ ప్రొఫెసర్. డి. నారాయణ రావు చెప్పారు.

లూబ్రికెంట్ల వినియోగం తగ్గించడానికి, పర్యావరణ హితమైన వాటిని తయారు చేసే దిశగా తమ పరిశోధన సాగుతోందని ఆయన తెలిపారు. విడిభాగాల అరుగుదలను గణనీయంగా తగ్గించడానికి, లోడ్ భరించే శక్తిని 80 శాతం వరకూ పెంచే లక్ష్యంతో ఎస్‌ఆర్‌ఎం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు