స్టాలిన్ ఆశలపై నీళ్లు

11 May, 2015 11:42 IST|Sakshi
స్టాలిన్ ఆశలపై నీళ్లు

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టులో చుక్కెదురతుందని, దాంతో ఈసారి తాను ముఖ్యమంత్రి కావచ్చని ఆశించిన డీఎంకే కోశాధికారి, కరుణానిధి కొడుకు స్టాలిన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేయడంతోపాటు జయలలిత, మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించడంతో ఆమె ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు మొత్తం రంగం సిద్ధమైపోయింది. ఆమె అనుంగు అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేసేందుకు సిద్ధమైపోయారు. హైకోర్టు తీర్పు వెలువడగానే ఆయన జయ నివాసమైన పోయస్ గార్డెన్స్కు వెళ్లారు.

దాంతో డీఎంకే ఆశలు అడియాసలయ్యాయి. అక్రమాస్తుల కేసును హైకోర్టు సమర్థిస్తే.. ఆరేడు నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించడం ఖాయమని, అప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టవచ్చని కరుణ కుమారుడు స్టాలిన్ భావించారు. కానీ ఇప్పుడు ఆ కేసు నుంచి పూర్తి నిర్దోషిగా ఆమె బయటపడటంతో.. ఎలాంటి మచ్చ లేదు కాబట్టి.. ఎన్నికల ఫలితాల మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. కేసును ఎక్కువ కాలం నాన్చకూడదని, త్వరగా తేల్చాలని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడంతో తీర్పు ప్రతికూలంగానే వస్తుందని అందరూ అనుకున్నారు. చివరకు తమిళనాడు మంత్రులు కూడా తీర్పు ఎటు తిరిగి ఎటు వస్తుందోనన్న భయంతో భారీగా ఆలయాల్లో పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు జరిపారు. కానీ అనుకోకుండా జయలలిత విడుదల కావడంతో పెద్దెత్తున సంబరాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు