మెరీనా బీచ్‌లో హై డ్రామా!

19 Feb, 2017 07:56 IST|Sakshi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష తీరును వ్యతిరేకిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్‌ నిరాహార దీక్ష దిగడంతో మెరీనా బీచ్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చినిగిన చొక్కాతో గాంధీ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్న ఆయనను, ఆయన మద్దతుదారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, డీఎంకే శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

బలపరీక్ష సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్‌ సహా, ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి మార్షల్స్‌ గెంటివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్‌ చొక్కా చినిగింది. మార్షల్స్‌, పోలీసులు తనపై, తన ఎమ్మెల్యేలపై దాడి చేశారని, తిట్టారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామంతో ఆగ్రహంగా ఉన్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఆయన వెంట డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీ కనిమొళి కూడా ఉన్నారు. బలపరీక్ష జరిగిన తీరు, స్పీకర్‌ ధనపాల్‌ వ్యవహార సరళిపై గవర్నర్‌కు స్టాలిన్‌ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి మెరీనా బీచ్‌కు వచ్చారు. చినిగిన చొక్కాతోనే అక్కడ ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్న ఆయనకు డీఎంకే నేతలు, శ్రేణులు మెరీనా బీచ్‌ చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎంకే శ్రేణులు ఎక్కువగా తరలిరాకముందే పోలీసులు స్టాలిన్‌ను, డీఎంకే నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి  తరలించారు.