పాక్‌తో చర్చలు అనుమానమే!

22 Aug, 2015 03:21 IST|Sakshi
పాక్‌తో చర్చలు అనుమానమే!

భారత్ - పాక్‌ల ఎన్‌ఎస్‌ఏ చర్చలపై ‘హురియత్’ నీలినీడలు  
కశ్మీర్ వేర్పాటు నేతలతో పాక్ ఎన్‌ఎస్‌ఏ భేటీ కావాలనుకోవడంపై భారత్ ఆగ్రహం
అది సరికాదని, ఆ ఆలోచన విరమించుకోవాలని పాక్‌కు సూచన

* భారత్ సలహాను తోసిపుచ్చిన పాకిస్తాన్; హురియత్ నేతలను కలుస్తామని స్పష్టీకరణ
* సంయమనం పాటించాలని ఇరుదేశాలకు ఐరాస చీఫ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్‌ఎస్‌ఏ) స్థాయి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

పాక్ మొండి పట్టుదలతో చర్చలకు పురిట్లోనే సంధి కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. చర్చల కోసం రేపు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్ అజీజ్ కశ్మీర్ వేర్పాటు నేతలతో భేటీ కావాలనుకోవడంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం చర్చల ప్రక్రియ నిలిపివేతకు దారితీసేలా కనిపిస్తోంది. వేర్పాటువాద నేతలతో భేటీ సరికాదని భారత్ సున్నితంగా ఇచ్చిన సూచనను పాక్ పెడచెవిన పెట్టింది. ఎన్‌ఎస్‌ఏ చర్చల కోసం భారత్ వస్తున్న పాక్ అధికారి.. కశ్మీర్ వేర్పాటు నేతలను కలుసుకోవడం తమకు ఆమోదయోగ్యం కాదన్న భారత్ సలహాను పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

భారత్ వెళ్లే తమ నేతలు, అధికారులు వేర్పాటువాదులతో భేటీ కావడం సాధారణమేనని, ఆ సంప్రదాయాన్ని కాలదన్నే ఆలోచన తమకు లేదని అధికారికంగానే తేల్చిచెప్పింది. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, హురియత్ నేతలే ‘భారత్ ఆక్రమిత కశ్మీరీ’ల నిజమైన ప్రతినిధులంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేసింది. చర్చల బంతి భారత్ కోర్టులో ఉందని, చర్చల్లో పాల్గొంటారా? లేక బంతిని తీసుకుని పారిపోతారా? చూడాల్సి ఉందంటూ పాక్ సమాచార మంత్రి పర్వేయిజ్ రషీద్ అన్నారు.
 పాక్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది.

నిర్మాణాత్మక చర్చలు జరపాలంటూ రష్యాలోని ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్‌లు తీసుకున్న నిర్ణయం నుంచి పాక్ తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. ‘హురియత్ నేతలతో భేటీ కావాలనుకునే పాక్ పట్టుదల ఉఫా ఒడంబడికకు సంపూర్ణ ఉల్లంఘనే కాకుండా ఆమోదిత ఎజెండానుంచి తప్పుకోవడమే’ అని స్పష్టం చేసింది. ‘ద్వైపాక్షిక సంబంధాల్లో ఇద్ద రు ప్రతినిధులు మాత్రమే ఉంటారు. ముగ్గురు కాదనే విషయంలో భారత్ స్పష్టతతో ఉంది. ఆ విధానానికే కట్టుబడి ఉంది.

ఏకపక్షంగా షరతులు, ఆమోదిత ఎజెండాను ఉల్లంఘించడం చర్చలకు ప్రాతిపదిక కాబోవు’ అని తేల్చిచెప్పింది. భారత్ ఆగ్రహాన్ని పట్టించుకోని పాక్.. సోమవారం ఉదయం 9.30 గంటలకు పాక్ ఎన్‌ఎస్‌ఏ అజీజ్ కశ్మీర్ అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీతో భేటీ అవుతారని ప్రకటించింది. అంటే, భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో భేటీకి ముందే గిలానీతో అజీజ్  సమావేశమవుతారు. కాగా, పాక్‌తో జరిగే చర్చల్లో ఉగ్రవాదం మాత్రమే ఎజెండా అని భారత హోంమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.  
 
చర్చలకు కట్టుబడి ఉన్నామని, అయితే, పాక్ విధిస్తున్న ఏకపక్ష షరతులు చర్చల కొనసాగింపునకు ప్రాతిపదిక కాబోవని భారత్ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఉఫాలో రెండు దేశాల ప్రధానులు అంగీకరించిన ఎజెండాపై పాక్ వెనక్కి వెళ్తోందని, అది చర్చలను పాక్ సీరియస్ తీసుకున్నట్లు కనిపించడం లేదంది.
 
అది మా సంప్రదాయం: పాక్
అర్థంలేని కారణాలు చూపుతూ భారత్ ముందస్తు షరతులు విధించడం తమకు నిరుత్సాహం కలిగిస్తోందని పాక్ పేర్కొంది. ముందు అంగీకరించిన నిర్ణయాలపై భారత్ వెనక్కు వెళ్తోందంటూ పాక్ విదేశాంగ శాఖ  శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. హురియత్ నేతలతో తమ చర్చలుంటాయని స్పష్టం చేసింది. భారత్ ఆజ్ఞలను పాటించబోమని, భారత్-పాక్ చర్చలు షరతులతో కూడిన దౌత్యంపై ఆధారపడిలేవని పేర్కొంది.

చర్చల నుంచి పారిపోయేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇప్పటికీ చర్చల ఎజెండాను భారత్ తమకు పంపించనేలేదని ఆరోపించింది. చర్చలకు ముందస్తు షరతులు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదంది. పాక్ సైన్య, పౌర నాయకత్వంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక సమాలోచనలు జరిపిన అనంతరం ఈ స్పందన వెలువడింది. ‘అమలు చేయని ఐరాస భద్రతామండలి తీర్మానం ప్రకారం.. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతం.

భారత్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల వాస్తవ ప్రతినిధులు హురియత్ నేతలే. కశ్మీర్ సమస్య పరిష్కార యత్నాల్లో వారిదే వాస్తవ ప్రాతినిధ్యం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉఫా ప్రకటన మేరకు కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలతో ఎజెండాను ఈ చర్చల నిమిత్తం  భారత్‌కు ప్రతిపాదించాం’ అని తెలిపారు.  హురియత్ నేతలతో భేటీ కావడమనే సంప్రదాయం నుంచి తప్పుకోదల్చుకోలేదని పాక్‌లోని భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్‌కు పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధరి శుక్రవారం సందేశం పంపించారు.  
 
దౌత్యంలో షరతులుండవు: హురియత్
న్యూఢిల్లీ/శ్రీనగర్: దౌత్య వ్యవహారాల్లో హద్దులు, షరతులు ఉండకూడదని జమ్మూ కశ్మీర్ మితవాద వేర్పాటువాది, హురియత్ నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ అన్నారు. భారత్, పాక్‌లు చిత్తశుద్ధితో చర్చల ప్రక్రియ కొనసాగించగలిగితే, ఆ చర్చల్లో ఎప్పుడు పాలు పంచుకోవాలనే విషయంలో తమకు పట్టింపు లేదన్నారు. కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యలు పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమన్నారు. కశ్మీర్ సమస్యను పక్కనపెట్టడమో, పట్టించుకోకపోవడమో చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ‘కశ్మీర్ సరిహద్దు సమస్య కానే కాదు. అది 1.25 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. కశ్మీరీలు తృతీయ స్థాయి ప్రతినిధులు కాదు. వారే మౌలికప్రతినిధులు’ అని ఆయన స్పష్టం చేశారు.
 
చర్చలు జరపండి..
కాగా, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ బాన్‌కి మూన్ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్చలను జరపాలన్నారు.  
 
పాక్, ఐఎస్‌ఐఎస్ జెండాల ప్రదర్శన
శ్రీనగర్: శ్రీనగర్‌లో శుక్రవారం కొంతమంది యువకులు భారత జాతీయ పతాకాన్ని తగులబెట్టి, పాక్, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. నౌహట్టా ప్రాంతంలోని జామియా మసీదులో ప్రార్థనలు ముగిశాక ఆందోళనకారులు అక్కడి దగ్గర్లో నిరసన తెలిపారు. త్రివర్ణ పతాకంతోపాటు పీడీపీ పార్టీ జెండాలనూ దగ్ధం చేశారు. వారిలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
 
వేర్పాటువాద నేత అహ్మద్ షాకు గృహనిర్బంధం
కశ్మీర్ వేర్పాటువాద నేత, డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ చీఫ్ షాబిర్ అహ్మద్ షాను శుక్రవారం ప్రార్థన నేపథ్యంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసులు ఆయనకు ప్రార్థనల కోసం బయటకెళ్లేందుకు అనుమతించలేదని పార్టీ ప్రతినిధి తెలిపారు. మరోపక్క.. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ గృహనిర్బంధం కొనసాగుతోంది. హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, జేకేఎల్‌ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్ తదితర వేర్పాటు నేతలను గురువారం పోలీసులు కొన్నిగంటల పాటు గృహనిర్బంధంలో ఉంచి తర్వాత విడుదల చేశారు.
 
ఉఫా స్ఫూర్తిని కాలదన్నడమే: భారత్
పాక్ తీరు ‘ఉఫా’ స్ఫూర్తిని కాలదన్నేలా ఉందని భారత్ పేర్కొంది. ‘అన్ని ఉగ్రవాద అంశాలపై చర్చించాలని ఉఫాలో ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతికి చర్యలు తీసుకోవాలని అంగీకరించారు. కానీ  జరుగుతున్నదేంటి? సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిగాయి.

ఓ పాక్ ఉగ్రవాదిని పట్టుకున్నాం. ఇవన్నీ చర్చల సందర్భంగా పాక్‌కు ఇబ్బంది కలిగించేవే. అందుకే చర్చల నుంచి తప్పుకునేందుకు పాక్ ఈ ఎత్తులు వేస్తోంది’ అని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ జైపూర్లో అన్నారు. చర్చల ఎజెండాను పాక్‌కు పంపామని, దానికి విరుద్ధమైన ఎజెండాను పాక్ పంపిందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు