ఆమె స్ఫూర్తికి ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’!

11 Feb, 2017 02:33 IST|Sakshi
ఆమె స్ఫూర్తికి ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’!

స్వచ్ఛమైన మనసే అసలైన అందం అన్న లక్ష్మీ అగర్వాల్‌

సాక్షి, అమరావతి బ్యూరో:
ఢిల్లీకి చెందిన యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. యాసిడ్‌ దాడులను అడ్డుకోవాలని, బాధితులను ఆదుకోవాలని ఉద్యమించిన సామాజిక కార్యకర్త ఈమె. ఆమె మాటలు అందరిలో స్ఫూర్తినింపుతూ బాధ్యతను గుర్తు చేశాయి. అందుకే సదస్సుకు హాజరైన వారంతా ఆమె ప్రసంగం ముగియగానే లేచి నిల్చొని అభినందించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ ‘అసలు అందమంటే ఏమిటి’అని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాహ్య సౌందర్యం అందం కాదని గుర్తించాలని స్పష్టం చేశారు. అందమంటే ఏమిటో కచ్చితంగా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సమాజంలో మహిళలపై వివక్ష, దాడులను అడ్డుకోగలమని తేల్చి చెప్పారు.

యువతులను అందవిహీనంగా చేసి పైశాచిక ఆనందాన్ని పొందేం దుకే దుండగులు యాసిడ్‌ దాడులకు పాల్పడుతున్నారన్నారు. పెళ్లాడాలని తన వెంట పడిన పోకిరీ మాట వినలేదనే తనపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అతనికి న్యాయస్థానం శిక్ష విధించిందని తెలిపారు. దోషులను శిక్షించడంతో ప్రభుత్వం చేతులు దులుపుకోకూడదన్నారు. యాసిడ్‌ దాడుల బాధితులకు సరైన పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. యాసిడ్‌ దాడులకు గురైన మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏ సంస్థ కూడా సమ్మతించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బీపీవోలో ఉద్యోగం ఇచ్చేందుకు ఓ సంస్థ నిరాకరించిన విషయాన్ని ఆమె వెల్లడించారు. స్వచ్ఛమైన మనసుతో కూడిన అంతః సౌందర్యం, ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె ఉద్బోధించారు.

సాధికారతపై ఇంకా మాటలేనా?: బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ షర్మిన్‌ చౌదరి
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చి ఎన్నో ఏళ్లయినా ఇంకా మహిళా సాధికారత గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ షిరిన్‌ షర్మిన్‌ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన, సమానత్వం కోసం మహిళలు ప్రారంభించిన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా పార్లమెంటులో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం టెక్నాలజీ టైమ్‌ నడుస్తోందని, ప్రపంచీకరణతో అన్నిచోట్లా ఇది విస్తరించడంతో అందరి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇంకా మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.   ప్రతి మహిళలోనూ అనేక నైపుణ్యాలుంటాయని, వాటితోపాటు ఓర్పు, సహనం వారి సొంతమన్నారు.

నాయకత్వం మనలోనే ఇమిడి ఉంటుంది: కిరణ్‌బేడి
మహిళలకు అవకాశాలు కుటుంబం నుంచి మొదలై పాఠశాల, సమాజ స్థాయిలో వివిధ రకాలుగా వస్తాయని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి అన్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ముం దుకెళ్లాల్సి ఉంటుందన్నారు. నాయకత్వ స్థాయికి చేరుకోవడంతోపాటు దాన్ని ఉపయోగించుకుని ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. నాయకత్వం ఎక్కడో బయట ఉండదని, మనలోనే ఉంటుందని తెలిపారు.

కెన్యా పార్లమెంట్‌లో 20 శాతమే: లబొసె  
తమ దేశ పార్లమెంట్‌లో మహిళల భాగస్వామ్యం 20 శాతమే ఉందని కెన్యా డిప్యూటీ స్పీకర్‌ జొయ్‌సె లబొసె చెప్పారు. 30 శాతం మంది మహిళలను పార్లమెంట్‌కు నడిపించేందుకు తాము పోరాటం చేస్తున్నామన్నారు. అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, తమ హక్కు ల కోసం మహిళలు పోరాడాలని కోరారు.

>
మరిన్ని వార్తలు