విచారణ ప్రారంభించండి

30 Jul, 2015 02:52 IST|Sakshi

సాయిరెడ్డి పిటిషన్‌పై ఈడీ కౌంటర్

హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి నమోదు చేసిన కేసులో.. జగతి పబ్లికేషన్స్ సంస్థలో పెట్టుబడులపై దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశామని, ఇందులో విచారణ ప్రారంభించాలని ఈడీ న్యాయస్థానానికి నివేదించింది. మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్) చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. ఈడీ నమోదు చేసి ఈసీఐఆర్ పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చేయాలని కోరుతూ ఈడీని ఆదేశించాలని, అప్పటివరకు న్యాయస్థానంలో విచారణను ఆపాలని కోరుతూ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. జగతిలో పెట్టుబడులపై దాఖలు చేసిన చార్జిషీట్‌కు ఇతర ఆరోపణలతో సంబంధం లేదని తెలిపారు. నేర విచారణచట్టం (సీఆర్‌పీసీ)నిబంధనల మేరకు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేస్తారని, దాన్ని వెంటనే కోర్టుకు అందజేయాల్సి ఉంటుందని.. అయితే పీఎంఎల్ చట్టం ప్రకారం ఈసీఐఆర్ ఈడీ దర్యాప్తు కోసం నమోదుచేసే అంతర్గత పత్రమని తెలిపారు.

ఈసీఐఆర్‌ను కోర్టుకు సమర్పించాల్సిన అవసరంలేదని, ఈసీఐఆర్‌కు ఎటువంటి చట్టబద్ధత లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసీఐఆర్‌పై దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం విచారణార్హం కాదన్నారు. ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్‌పై విచారణ ప్రారంభించినా నిందితులకు ఎటువంటి నష్టం లేదని పేర్కొన్నారు. ఈ కౌంటర్‌ను పరిశీలించిన న్యాయమూర్తి టి.రజని విచారణను ఆగస్టు 14కు వాయిదా వేశారు. కాగా ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డిలు కోర్టు ముందు హాజరయ్యారు.
 
 

మరిన్ని వార్తలు