ఎంపీలు రాజీనామా చేయకే ఈ విపత్తు: అశోక్‌బాబు

19 Feb, 2014 03:39 IST|Sakshi
ఎంపీలు రాజీనామా చేయకే ఈ విపత్తు: అశోక్‌బాబు

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయం
సీఎం రాజీనామాతో ప్రయోజనం ఉండదు

 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయం చేసినరోజే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా చేసుంటే విభజన జరిగుండేది కాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. వారు రాజీనామా చేయనందునే ఈ విపత్తు ఏర్పడిందన్నారు. రాజకీయ వ్యూహంలో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీల నేతలు విఫలమయ్యారన్నారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ అంతకు అంత అనుభవిస్తుందని, కాంగ్రెస్ భూస్థాపితం ఖాయమని అన్నారు. సీమాంధ్ర నేతలు సమయం అయిపోయాక యుద్ధం చేశారని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన విజయ్‌చౌక్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
 
 ‘‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే. ఎంపీలను కొట్టించి, తలుపులు మూసి, ప్రసారాలను నిలిపివేసి నిర్ణయం చేశారు. దీనికి యూపీఏ మూల్యం చెల్లించాల్సిందే. ఇందులో బీజేపీకి భాగస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే బీజేపీ మద్దతిచ్చింది. బిల్లువద్దని వందరోజులు ఉద్యమం చేశాక కూడా దాని తీవ్రతను గుర్తించకపోవడం జాతీయ పార్టీల వైఫల్యం’’ అని అన్నారు. సీఎం కిరణ్ రాజీనామా చేస్తారంటున్నారు, దీన్నెలా చూస్తారని ప్రశ్నించగా.. ‘‘ఇంత ప్రక్రియ ముగిశాక సీఎం రాజీనామాతో ప్రయోజనం లేదు’’ అని ఆయన బదులిచ్చారు. సీఎం వద్ద ఆఖరుబంతి ఉందన్నారు కదా? అని అడగ్గా.. ఆయనవద్ద ఆఖరు బంతి ఉందో, లేదో మీకే తెలుసు అని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌కు మద్దతిస్తారా? అని అడగ్గా.. బంద్‌లతో ప్రయోజనం ఉంటుందని అనుకోవట్లేదని బదులిచ్చారు.
 
 ముగిసిన ధర్నా: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఢి ల్లీలోని రాంలీలామైదానంలో నిర్వహించిన రెండురోజుల ధర్నా మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది. టీ-బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని తెలియడంతో శిబిరంలో తీవ్ర నిరాశ అలుముకుంది. కాగా ఉదయం పదిగంటలకు ప్రారంభమైన ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వెలువడడానికి కొన్ని నిమిషాలముందే ముగిస్తున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటించారు. నిరాశచెందకుండా తుదివరకు పోరాటంలో ఉండాలని ఉద్యోగులకు సూచించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ తదితరులు ధర్నాకు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. ధర్నాలో చలసాని శ్రీని వాస్, సమైక్యవిద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అడారి కిశోర్‌బాబు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.  సమైక్యవాదుల రైళ్లు మంగళవారం రాత్రి బయలుదే రాయి.

మరిన్ని వార్తలు