పలు ప్రాంతాల్లో వరదలు: రాష్ట్రం జలదిగ్బంధం

21 Jul, 2013 03:01 IST|Sakshi
పలు ప్రాంతాల్లో వరదలు: రాష్ట్రం జలదిగ్బంధం

ముంపులో 300కు పైగా గ్రామాలు
లక్షలాది ఎకరాల్లో పంటలు కుళ్లిపోయే ప్రమాదం
మరో 48 గంటలు భారీ వర్షాలు
ఇంకా మహోగ్రంగానే గోదావరి
భద్రాద్రిలో నెమ్మదించినా దిగువన విశ్వరూపం
ధవళేశ్వరం వద్ద 24 ఏళ్లలో రికార్డు స్థాయి వరద
గోదావరి జిల్లాల్లో ముంపు ముప్పులో మరిన్ని లంకలు
ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, కొన్నింటి దారి మళ్లింపు
భద్రాచలంలోనూ మళ్లీ వరద పెరిగే అవకాశం
రవాణా, కరెంటు లేక పలు మండలాల్లో నరకయాతన
ప్రాథమిక అంచనా ప్రకారమే 2.6 లక్షల ఎకరాలు మునక
 
రాష్ట్రానికి వాన ముప్పు ఇంకా తొలగలేదు. కనీవినీ ఎరగని భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న తెలంగాణ, కోస్తా జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దాంతో ఇప్పటికే ముంపు బారిన పడ్డ వందలాది గ్రామాలు వణికిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ, ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి కనీసం 300 దాకా గ్రామాలు, లంకలు జల దిగ్బంధంలోనే బిక్కుబిక్కుమంటున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గినా నీటిమట్టం 56 అడుగులుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శబరి నది పోటెత్తుతుండటంతో భద్రాచలం వద్ద వరద మళ్లీ పెరిగేలా ఉంది. ఖమ్మంలో ఇప్పటికే 185 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి! గోదావరి నీటిమట్టం 63.5 అడుగులు దాటితే మరో 135 గ్రామాలు ముంపుకు గురవుతాయని క లెక్టరే ప్రకటించారు. ఇక పశ్చిమ గోదావరిలోనైతే గోదావరి విశ్వరూపం చూపుతోంది. గత 24 ఏళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో వరద ముంచెత్తుతోంది. శబరితో పాటు పలు కొండ వాగుల నుంచి పోటెత్తుతున్న వరదంతా వచ్చి చేరుతుండటంతో శివాలెత్తుతోంది. 50కి పైగా గ్రామాలు ముంపునకు గురైనట్టు సమాచారం. అటు ధవళేశ్వరం వద్ద కూడా నీటిమట్టం శనివారం 16.1 అడుగులకు చేరింది. 1989 నుంచి జూలై నెలలో ఇదే రికార్డు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా ఆదివారానికల్లా మూడో హెచ్చరిక కూడా జారీ అయ్యేలా కన్పిస్తోంది. తూర్పు గోదావరిలో 70కి పైగా గ్రామాలు ముంపులో ఉన్నాయి. మెదక్ జిల్లా కల్హేర్ మండలం ఫత్తేపూర్ వద్ద నల్లవాగుపై వంతెనకు శుక్రవారం రాత్రి గండి పడటంతో మెదక్-నిజామాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఐదు రోజులుగా ముంచెత్తిన వరదతో రైతు గుండె చెరువవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు, మరో రెండు రోజులు వరద నీరు అలాగే ఉంటే కుళ్లిపోతాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.6 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఒక్క నిజామాబాద్‌లోనే అత్యధికంగా 1.82 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది! మరోవైపు ముంపు బాధితులను ఆదుకోవడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోంది. ఖమ్మంలో చాలాచోట్ల బాధితులకు బియ్యం, పప్పులు, నూనె ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వండుకునే పరిస్థితి లేక చాలామంది ఆకలితోనే అలమటించారు. ఖమ్మంలో అధికారులను, కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ను బాధితులు నిలదీశారు. ముంపు మండలాలకు రవాణాతో పాటు విద్యుత్ సదుపాయం కూడా ఇంకా దెబ్బతినే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కనీసం 3,000కు పైగా ఇళ్లు కూలిపోయాయని అంచనా. మరోవైపు వరదల నేపథ్యంలో విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
 
సాక్షి, నెట్‌వర్క్:
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. 13 మండలాల్లో 181 గ్రామాలు, కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కనీసం 20,675 ఎకరాల్లో పత్తి, వరి నీట మునిగాయి. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం గోదావరి 55.6 అడుగుల నీటిమట్టంతో నిలకడగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. చాలా మండలాల్లో రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 13 మండలాల్లో ఎటు చూసినావరద నీరే కనిపిస్తోంది. భద్రాచలం నుంచి అన్ని మండలాలకూ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణం, చింతూరు మినహా మిగతా మండలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాంతో భద్రాచలం ఏజెన్సీలోని వందలాది గ్రామాలు రెండు రోజులుగా అంధకారంలో మగ్గాయి. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయి జనం అల్లాడుతున్నారు.

ఆలయం వద్దా నీరే
భద్రాచలం రామాలయం స్నానఘట్టాల రేవులోని ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు నీట మునిగాయి. కరకట్టల స్లూయిస్‌ల లీకేజీ కారణంగా వరద నీరు భద్రాచలం పట్టణంలోకి చేరింది. దాంతో రామాలయం సమీపంలోని విస్తా కాంప్లెక్స్ కూడా నీట మునిగింది.

సహాయక చర్యల్లో వైఫల్యం
భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ముంపు తీవ్రత ఉన్న గ్రామాల నుంచి సుమారు 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికోసం 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ తగిన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం జిల్లా యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. బాధితులకు కొన్ని చోట్ల బియ్యం, పప్పులు, నూనె ఇచ్చి చేతులు దులుపుకోవటంతో వాటితో వండుకునే పరిస్థితి లేక అనేక మంది ఆకలితోనే అలమటించారు. సారపాక ఐటీసీ ఇచ్చిన పులిహోర ప్యాకెట్లతోనే  సరిపుచ్చారు. తానీషా కల్యాణ మండపంలో బస చేసిన బాధితులకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వారు సరఫరా చేసిన ప్రసాదాలను మాత్రమే పెట్టారు. దాంతో వారు తీవ్ర నిరసన తెలిపారు. అక్కడికి వెళ్లిన సెక్టోరియల్ అధికారి గణేశ్‌ను అడ్డుకున్నారు. శనివారం సాయంత్రం తమ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి బలరాం నాయక్‌కూ నిరసన తెలిపారు.

పోటెత్తుతున్న శబరి
ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలతో శబరి నది పోటెత్తుతోంది. శనివారం సాయంత్రం 38 అడుగుల నీటిమట్టం నమోదైంది. అది మరింత పెరగవచ్చని కలెక్టర్ శ్రీనరేశ్ తెలిపారు. దాంతో భద్రాచలం వద్ద వరద పెరగవచ్చని స్థానికులు భయపడుతున్నారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

నీట మునిగిన మంథని
కరీంనగర్ జిల్లా మంథని డివిజన్‌లోని అటవీ గ్రామాలు శనివారం కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సహాయక చర్యల కోసం మూడు వాయు సేన హెలికాప్టర్లు, విజయవాడ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు శనివారం జిల్లాకు చేరాయి. మహదేవపూర్ మండలం పెద్దంపేట, పంకెన, పలిమెల పెద్ద వాగులతో పాటు బండలవాగు, తీగల వాగులు, మరో అయిదు ఒర్రెల్లో నీరు కమ్మి పెద్దంపేట నుంచి ముకునూరు వరకు 14 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మోదేడు, పంకెన, పలిమెల, సర్వాయిపేట, దమ్మూరు, ముకునూరు, నీలంపల్లి గ్రామాల్లో రెండు హెలికాప్టర్లు ఆహారం, మంచినీటి ప్యాకెట్లు, మందులు జారవిడిచాయి. మహాముత్తారం మండలంలోని సింగంపల్లి, కనుకునూరు, రెడ్డిపల్లి జల దిగ్బంధంలో ఉన్నాయి. సింగంపల్లి సమీపంలోని పెద్దవాగు వద్ద రోడ్డు, కల్వర్టు పనులను నిర్వహిస్తున్న లారీ, పొక్లెయిన్, ట్రాక్టర్‌తో పాటు ఇతర సామగ్రి శుక్రవారం వరదలో ఏకంగా కిలోమీటరు దూరం కొట్టుకుపోయాయి!
 
ఉభయ గోదావరిలో ఉగ్రగోదారి
పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఏజెన్సీ, లంక గ్రామాలను ముంచెత్తిన నీటి ప్రవాహం డెల్టా గ్రామాలనూ ముంచెత్తుతుందనే భయం జిల్లా వాసులను కలవరపెడుతోంది. పోలవరం, కొవ్వూరు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలు వరద ప్రభావానికి గురవుతున్నాయి. పోలవరం మండలంలోని 26 గిరిజన గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. వాటి పరిస్థితిని పరిశీలించేందుకు అధికారుల బృందం విఫలయత్నం చేసింది. 10 వేల ఎకరాల్లో తోటలు, పంటలు నీట మునిగారుు. గత 24 ఏళ్లలో జూలై నెలలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పోటెత్తుతోంది. శనివారం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం రికార్డు స్థాయిలో 16.1 అడుగులకు చేరింది. దాంతో 16,20,808 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 1989 జూలై 27న అత్యధికంగా 15.3 అడుగులు నమోదైంది. ఆదివారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక అయిన 17.75 అడుగులకు నీటిమట్టం చేరవచ్చని భావిస్తున్నారు. దీంతో గోదావరి లంకల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశిస్తున్నారు. భద్రాచలం దాటిన అనంతరం గోదావరిలో కలిసే శబరి నది, కొండ వాగులు పోటెత్తుతున్నాయి. ఆ వరదంతా గోదావరిలో చేరుతుండటంతో నది విశ్వరూపం చూపుతోంది. జిల్లా వరదల ప్రత్యేక అధికారి సంజయ్‌జాజు తదితరులు  పునరావాస శిబిరాన్ని సందర్శించారు. జాతీయ విపత్తు నివారణ బృందం రంగంలోకి దిగింది. లంక గ్రామాల నుంచి 1,240 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి పెరిగితే లక్ష్మీపాలెం, పెద్దరాజుపాలెం, గంగన్నపాలెం, యలమంచిలిలంక, బాడవ, దొడ్డిపట్ల పల్లెపాలెం ప్రాంతాలు ముంపు బారిన పడేలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 40 గ్రామాలు, సీతానగరం మండలంలో ఒక గ్రామం శుక్రవారం మధ్యాహ్నం నుంచే జలదిగ్బంధంలో ఉన్నాయి. బ్యారేజీకి దిగువన మరో 31 లంక గ్రామాలు కూడా నీటిముట్టడిలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల  కొబ్బరితోటల్లో వరదనీరు చేరింది. ఇప్పటి వరకూ 9 గ్రామాల్లో 970 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు కలెక్టర్ వెల్లడించారు.
 
ముంపులో 20 గ్రామాలు
ఆదిలాబాద్ జిల్లాలో అపార నష్టం సంభవించింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదుల్లో శనివారం వరద ప్రవాహం తగ్గింది. అయినా 20 గ్రామాల దాకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. పంట చేల నిండా ఇసుక మేట వేసింది. రాళ్లూరప్పలు కన్పిస్తున్నాయి. మొక్కలపై బురద చేరింది. 170కి పైగా గ్రామాల్లో కనీసం 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తే నష్టం తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ పంపుసెట్లు, పైపులు, పనిముట్లు, ఎరువులతో పాటు ఎడ్లు కూడా కొట్టుకుపోయాయి! ప్రాజెక్టులు నిండు కుండలా అగుపిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లు చెడిపోయి, కరెంటు స్తంభాలు పడిపోయి చాలాచోట్ల ఇప్పటికీ అంధకారం నెలకొంది. 21 కి.మీ. పొడవున రోడ్లు ధ్వంసమైనట్టు ప్రాథమిక సమాచారం.
 
వంతెనకు గండి
భారీ వర్షానికి మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని ఫత్తేపూర్ వద్ద నల్ల‘వాగు’పై వంతెనకు శుక్రవారం రాత్రి గండి పడింది. దాంతో మెదక్-నిజామాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అది ఇరువైపులా దెబ్బతింది. దానిపై బైక్‌లు తప్ప మరే వాహనాలూ నడవడం లేదు.
 
కొనసాగుతున్న వర్ష బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం శనివారం కూడా కొనసాగింది. ఎగువన కురిసిన భారీ వర్షానికి జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు నీటిమట్టం ఒక్క సారిగా 455 మీటర్లకు (మొత్తం 458 మీటర్లు- 1 టీఎంసీ) పెరిగింది. దీంతో ఈ ప్రాజెక్టు కుడివైపు ఉన్న కట్ట కుంగిపోయింది. అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు హుటాహుటిన ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 1,500 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ ద్వారా వదులుతున్నారు. సింగీతం రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఏడు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. వర్షం దాటికి దెబ్బతిన్న చెరువుల సంఖ్య 61కు చేరింది. కూలిపోయిన ఇళ్ల సంఖ్య కూడా 3,467కు పెరిగిందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతున్నది. ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో వరదలతో ముంపునకు గురైన మానసపల్లి, ఓడవాడ ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తుల నివారణ బృందాన్ని ఏజెన్సీ ముంపు ప్రాంతాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 191 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయి.

మరిన్ని వార్తలు