సేవా పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు పి. చిదంబరం

10 Nov, 2013 01:27 IST|Sakshi
సేవా పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు పి. చిదంబరం

 చెన్నై:   సేవా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం హెచ్చరించారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి గురించి ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా పన్ను ఎగవేత ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా  పది మంది అరెస్టయ్యారని చిదంబరం తెలిపారు. సర్వీస్ ట్యాక్స్ ఎగవేత ఎక్కువగా ఉండే కన్సల్టెన్సీ, ఐటీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తోందని ఆయన చెప్పారు. కొన్ని నగరాల్లో ఇది తీవ్ర స్థాయిలో ఉండటాన్ని తాను గమనించినట్లు చిదంబరం చెప్పారు. ఉదాహరణకు చెన్నైలో కాంట్రాక్టు సర్వీసులు, అడ్వర్టైజ్‌మెంట్, ఐటీ, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో ఇలాంటి ధోరణి కనిపించిందన్నారు.

స్వచ్ఛందంగా సేవా పన్ను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీసీఈఎస్ పథకంపై పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు చెప్పారు. రూ. 50 లక్షలకు మించి ఎగవేసిన వారిపై మాత్రం అరెస్టు అస్త్రం ప్రయోగిస్తున్నామని, ఇది చిన్న మొత్తం కాదని ఆయన తెలిపారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి గురించి తమ దగ్గర వివరాలు లేవనుకోరాదని, తమ దగ్గర పుంఖానుపుంఖాలుగా సమాచారం ఉందని చెప్పారు. అయితే, శాఖాపరమైన పరిమితుల వల్లే అందరిపై తక్షణ చర్యలు సాధ్యపడటం లేదు తప్ప అంతిమంగా నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవని చిదంబరం హెచ్చరించారు.

మరిన్ని వార్తలు