స్టెరాయిడ్ క్రీములతో చర్మానికి హాని

19 Jul, 2015 01:53 IST|Sakshi
స్టెరాయిడ్ క్రీములతో చర్మానికి హాని

హైదరాబాద్: మేని నిగారింపును పెంచే హామీతో మార్కెట్లో లభిస్తున్న పలు స్టెరాయిడ్ ఆధారిత క్రీములు నిజానికి చర్మానికి మేలుకన్నా ఎంతో హాని చేసేవిగా ఉంటున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనిరియాలజిస్ట్స్ అండ్ లెప్రోలజిస్ట్స్(ఐఏడీవీఎల్) తెలిపింది. పాండెర్మ్ తదితర క్రీములు ఈ కోవకి చెందినవిగా పేర్కొంది. ఇవి క్లోబీటాసోల్  అనే స్టెరాయిడ్‌తో పాటు యాంటీబయోటిక్, యాంటీ-అమీబిక్, యాంటీ-ఫంగల్‌గా ఉపయోగపడే 4 రకాల ఔషధాల అసంబద్ధ కాంబినేషన్లతో తయారవుతున్నాయంది. రూ. 1,555 కోట్ల టాపికల్ స్టెరాయిడ్స్(చర్మంపై పూసే స్టెరాయిడ్స్ క్రీములు) మార్కెట్లో సుమారు 85 శాతం వాటా ఈ తరహా కాంబినేషన్ క్రీములదే ఉంటోందని తెలిపింది.

చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో దాదాపు 60 శాతం మంది ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ గల క్రీములను వాడుతున్నట్లు 2011లో 12 నగరాల్లో తాము నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు వివరించింది. వీటిపై 2005 నుంచి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలూ లేవని ఐఏడీవీఎల్ టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ అబీర్ సారస్వత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐతో పాటు ఫార్మా విభాగం కార్యదర్శిని కలిసిన ఐఏడీవీఎల్ బృందం ఇటువంటి అసంబద్ధ కాంబినేషన్ల క్రీముల తయారీ, అమ్మకాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
 
 

మరిన్ని వార్తలు