మొహమాటపడ్డారో చిక్కినట్టే!

17 Jan, 2015 01:50 IST|Sakshi
మొహమాటపడ్డారో చిక్కినట్టే!

 సాక్షి, హైదరాబాద్: ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా కొనుగోలు చేసేటప్పుడు కొందరు మధ్యవర్తులు తొందర పెడుతుంటారు. త్వరగా తీసుకోమని పోరు పెడతారు. ఇంత కంటే తక్కువకు మరెక్కడా దొరకదని బుకాయిస్తారు. ఎంతోకొంత బయానా ఇస్తే ఇల్లు మనకే దక్కుతుందని హడావుడి చేస్తారు. వారు చేసే తొందర వల్ల మనం మోహమాటం పడ్డామంటే అంతే సంగతులు. వారి బుట్టలో పడ్డట్లే! మన కళ్ల ముందు జరిగే సంఘటనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మోసపోతున్నామన్నా సందేహం కలుగుతుంది. అయినా మనకెందుకులే..తక్కువకు వస్తుంది కదా అని ఊరుకుంటాం. స్థిరాస్తి లావాదేవీల్లో మోసపోయిన వారిని గమనిస్తే ఇలాంటి వ్యవహారశైలి వల్ల కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని అర్థమవుతుంది. ప్రజలు ఎక్కువగా ఏయే సందర్భాల్లో మోసానికి గురయ్యారో తెలుసుకోవడానికి ‘సాక్షి రియల్టీ’ ఓ చెక్‌లిస్ట్‌ను రూపొందించింది. కాబట్టి స్థిరాస్తి కొనేవారెవ్వరైనా.. ఈ కింది అంశాల్లో ఏ ఒక్కటి మీకు అనుభవమైనా.. మోసం జరగడానికి అస్కారమెక్కువగా ఉందని అర్ధం చేసుకోవాలి.
 
  కొందరు మధ్యవర్తులు ఏం చేస్తారంటే.. అసలు పత్రాలు ఎక్కడో పోయాయని చెప్పి, సర్టిఫైడ్ కాపీలను చూపిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో తప్పకుండా అనుమానించాల్సిందే.
 
  పత్రాలు కలర్ జిరాక్స్‌లో ఉన్నా.. వాటిని ల్యామినేట్ చేసినట్లు కనిపించినట్లున్నా ఆలోచించాల్సిందే.
 
  సంతకాల్లో తేడా, ఒక్కో చోట ఒక్కో విధంగా ఉన్నప్పుడు.
 
  పత్రాలు సంబంధిత సమాచారంతో కాకుండా.. ఖాళీగా ఉండటం.
 
  పత్రాలను కేవలం నోటరీ చేసి ఉండటం.
 
  ఒప్పంద పత్రం అమలు సమయంలో అసలు విక్రయదారుడు సరైన సమయానికి రాకపోయినప్పుడు లేదా వాయిదా వేస్తున్నప్పుడు.
 
  క్రయపత్రాలు (సేల్‌డీడ్) పై నీలి రంగు పెన్నుతో సంతకం చేసి ఉందంటే అనుమానించాల్సిదే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నల్లరంగుతో సంతకం చేయటమనేది నిబంధన అని గుర్తుంచుకోండి.
 
  పత్రాలపై అమ్మకందారు వేలిముద్రలు వేయడానికి నిరాకరించినా.
 
  విక్రయదారు అనుకున్న సమయానికి ముందే ఒత్తిడి చేయడం, యజమాని విదేశాలకు వెళుతున్నాడనే సాకు చూపుతూ తొందరపెట్టిన సందర్భాల్లో.
 
  మీరు ఏదైనా సందేహ నివృత్తికి ప్రశ్నలు వేసినప్పుడు అమ్మకందారు అసహనం వ్యక్తం చేసినా.. కలవరపడినా.. ఏదో మతలబు ఉన్నట్లే.
 
  కొందరు మధ్యవర్తులు కానీ అమ్మకందారులు కానీ తెలివిగా ఏం చేస్తారంటే మానసికంగా బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. ‘కొంటే కొనండి.. వద్దంటే ఇబ్బందేం లేదు. ఇంతకంటే తక్కువ అయితే ఎప్పటికీ రాదు. మీరు కాదంటే కొనడానికి వందల మంది సిద్ధంగా ఉన్నార’ని పరోక్షంగా బెదిరిస్తారు. ఇలా మీతో అన్నారంటే ఆ అమ్మకంలో ఏదో గోల్‌మాల్ ఉన్నట్లే లెక్క.
 
 పైన పేర్కొన్న ఎలాంటి సందర్భం మీకెదురైనా జాగ్రత్తగా అడుగేయండి. లేకపోతే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

>
మరిన్ని వార్తలు