టర్నోవర్ పెరిగితేనే డౌన్‌ట్రెండ్

30 Sep, 2013 01:26 IST|Sakshi

మార్కెట్ పంచాంగం

దేశ ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్ ఫండమెంటల్స్ బలహీనంగా వున్నాయి. దేశంలో ఎన్నికల వాతావరణం అలుముకుంది. అయినా వారం రోజుల క్రితం స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని సవాలు చేయడానికి సిద్ధపడ్డాయి. అంటే స్టాక్ మార్కెట్‌కు ఆర్థిక వ్యవస్థతో లింకు తెగిపోయిందని, విదేశీ ఇన్వెస్టర్ల వ్యవహారశైలే సూచీల గమనాన్ని నిర్దేశిస్తున్నదని పరిగణించాలి. రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్ల అనూహ్య పెంపుతో క్రితం వారం ర్యాలీకి బ్రేక్‌పడినా, ఈ క్షీణతకు ఎఫ్‌ఐఐల అమ్మకాలు కారణం కాదు. దేశీయ సంస్థలే వరుస విక్రయాలు జరుపుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇప్పటికే రెండు బిలియన్ డాలర్ల నిధుల్ని ఎఫ్‌ఐఐలు కుమ్మరించారు. కానీ గతవారం వీరి కొనుగోళ్లు నెమ్మదించాయి. ఫలితంగా మార్కెట్లో ట్రేడింగ్ టర్నోవర్ పడిపోయింది. మార్కెట్ తగ్గిన రోజుల్లో టర్నోవర్ పెరిగే వరకూ ప్రస్తుత క్షీణత, ఆగస్టు చివరివారం నుంచి జరిగిన భారీ ర్యాలీకి ప్రతిగా జరుగుతున్న సర్దుబాటుగానే పరిగణించాలి.
 
 సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
 సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో తొలిరోజున 20,200 గరిష్టస్థాయి వద్ద నిరోధాన్ని చవిచూసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రమేపీ క్షీణిస్తూ చివరకు క్రితం వారంతో పోలిస్తే 537 పాయింట్ల భారీ నష్టంతో 19,727 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 19,600 పాయింట్లస్థాయి సమీపంలో 19,658 పాయింట్ల వద్ద క్రితం వారం మరోదఫా మద్దతును పొందగలిగింది. గత రెండు వారాల్లో ఐదు దఫాలు మద్దతును అందించిన 19,600 స్థాయిని ఈ వారం కోల్పోతే 19,483 స్థాయికి (ఆగస్టు 28 నాటి 17,748 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి సెప్టెంబర్ 19 నాటి 20,740 పాయింట్ల గరిష్టస్థాయివరకూ జరిగిన 3,292 పాయింట్ల ర్యాలీలో ఇది 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి) తగ్గవచ్చు.
 
 ఈ దిగువన సెప్టెంబర్ 10 నాటి కనిష్టస్థాయి 19,444 పాయింట్ల వద్ద మరో మద్దతు, సెన్సెక్స్‌కు 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖ సంచరిస్తున్న 19,395 పాయింట్ల స్థాయి వద్ద ఇంకో మద్దతు-ఇలా వరుసగా 19,395-19,483  మధ్య పలు మద్దతులు అందుబాటులో వున్నాయి. వీటినన్నింటినీ అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతోనే ప్రస్తుత కరెక్షన్, డౌన్‌ట్రెండ్‌గా రూపాంతరంచెందే ప్రమాదం వుంటుంది. గత వారం క్షీణత సందర్భంగా ట్రేడింగ్ పరిమాణం తక్కువగా వున్నందున, కార్పొరేట్ ఫలితాల సీజన్ ముగిసే వరకూ ఈ మద్దతుల్ని సెన్సెక్స్ పరిరక్షించుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ైఈ వారం 19,600 మద్దతును సెన్సెక్స్ పరిరక్షించుకోగలిగితే మరోదఫా 20,200 స్థాయికి పెరగవచ్చు. ఈ లోపున 19,990 పాయింట్ల వద్ద చిన్నపాటి అవరోధం ఏర్పడవచ్చు. అధిక ట్రేడింగ్ టర్నోవర్‌తో 20,200 స్థాయిని దాటితే 20,740 పాయింట్ల వరకూ ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది.  
 
 నిఫ్టీ మద్దతులు 5,798-5,751
 సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో 6,012 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 5,811 పాయింట్ల వరకూ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 179 పాయింట్ల నష్టంతో 5,833 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో కొన్ని షేర్ల వెయిటేజీల్లో వచ్చిన మార్పుల ఫలితంగా సెన్సెక్స్‌తో పోలిస్తే నిఫ్టీ వెనుకబడి వున్నందున, ఇప్పటికే ఈ సూచీ 200 డీఎంఏ రేఖను (5,841) కోల్పోయింది. అప్‌ట్రెండ్‌కు కీలకంగా భావించే ఈ స్థాయిని నష్టపోయిన శుక్రవారంనాడు ట్రేడింగ్ టర్నోవర్ చాలా తక్కువగా వుంది. రానున్న కొద్దిరోజుల్లో ఈ స్థాయి దిగువన వ్యాపార పరిమాణం పెరిగితేనే మార్కెట్లో డౌన్‌ట్రెండ్ వచ్చే అవకాశాలుంటాయి.
 
 గత శుక్రవారం అమెరికా మార్కెట్ల బలహీనత ఫలితంగా ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 5,798 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 5,751 స్థాయివరకూ (ఆగస్టు 28 నాటి 5,119 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి సెప్టెంబర్ 19 నాటి 6,242 పాయింట్ల గరిష్టస్థాయివరకూ జరిగిన 1.023 పాయింట్ల ర్యాలీలో ఇది 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి)  తగ్గవచ్చు. ఈ లోపున 5,738 పాయింట్లు, 5,688 పాయింట్ల వద్ద వరుసగా మద్దతులు లభిస్తున్నాయి.  ఈ వారం నిఫ్టీ రెండో మద్దతును పరిరక్షించుకోగలిగితే, వేగంగా 5,920-5,940 శ్రేణి వద్దకు పెరగవచ్చు. ఈ నిరోధ శ్రేణిని దాటితే 5,990 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, ముగిస్తే  6,150 పాయింట్ల వద్దకు పెరగవచ్చు.
 - పి. సత్యప్రసాద్

మరిన్ని వార్తలు