జాలి చూపడం కాదు.. చర్యలు తీసుకోండి!

11 Aug, 2016 17:27 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటులో ఓ ప్రకటన చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. దళితులపై దాడుల విషయమై ప్రధాని మోదీ వ్యాఖ్యలు కంటితుడుపు చర్యలేనని, రాజకీయంగా నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆమె తప్పుబట్టారు. గురువారం పార్లమెంటు వెలుపల మాయావతి విలేకరులతో మాట్లాడారు.

వేముల రోహిత్‌ ఆత్మహత్య, ఉనాలో దళితులపై దాడి, ఇతర దాడుల నేపథ్యంలో బీజేపీపై రాజకీయంగా ప్రభావం పడే అవకాశం ఉండటంతోనే ప్రధాని మోదీ స్పందించారని మాయావతి అన్నారు. 'దళితుల విషయంలో జాలి చూపించడం కాదు. వారిపై అరాచకాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై ప్రధాని దృష్టి సారించాలని బీఎస్పీ కోరుకుంటోంది' అని ఆమె పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు