ఖజానాకు కిక్కు..!

31 Aug, 2015 03:41 IST|Sakshi
ఖజానాకు కిక్కు..!

మద్యం ద్వారా భారీగా ఆదాయ సమీకరణకు సర్కారు పావులు
* దుకాణాల లెసైన్సు ఫీజుల రూపంలోనే రూ. 2 వేల కోట్లు అంచనా
* రూ. 12 వేల కోట్ల వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: మద్యం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పావులు కదుపుతోంది. అక్టోబర్ నుంచి అమలులోకి రానున్న నూతన మద్యం విధానం ద్వారా అంచనాలకు మించి ఆదాయం పొందేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

గుడుంబాకు విరుగుడుగా చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం మొదలుకుని.. మండలాలను గంపగుత్తగా వ్యాపారులకు కట్టబెట్టడం, కొత్త బార్ లెసైన్సుల మంజూరు, కుటీర పరిశ్రమల్లా బీర్ల ఫ్యాక్టరీలకు అనుమతులు, జీహెచ్‌ఎంసీలో షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో మద్యం విక్రయాలు, వైన్‌కేఫ్‌ల ఏర్పాటు వంటి ఆలోచనలన్నీ భారీ ఆదాయ సమీకరణలో భాగమేనని అధికార వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి.

2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు రూ. 10,300 కోట్లు రాబడి రాగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆ లక్ష్యాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారు. కానీ, ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తులు చూస్తుంటే రూ. 15 వేల కోట్ల రికార్డు ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు చెపుతున్నారు.
 
లెసైన్సుల ద్వారానే రూ. 2 వేల కోట్లు
2014-15 ఆబ్కారీ సంవత్సరం(జూలై1 నుంచి జూన్ 30)లో ఎక్సైజ్ శాఖకు లెసైన్సు ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 900 కోట్లు. మద్యం వ్యాపారులు నిర్ధేశిత లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మించి అమ్మకాలు జరిపితే సర్కారుకు చెల్లించే 13.6 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్ రూపంలో అదనంగా రూ. 400 కోట్లు సమకూరాయి. కానీ, ఈసారి లెసైన్సు ఫీజు రూపంలోనే రూ. 2 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

తదనుగుణంగానే జీహెచ్‌ఎంసీ, మరో మూడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ఏర్పాటు చేసే మద్యం దుకాణాల లెసైన్సు ఫీజును నిర్ణయించినట్లు సమాచారం. మండలం లెసైన్సుదారుడు గ్రామాల్లో కూడా బి-లెసైన్సు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇక ధరఖాస్తు ఫారాలతో పాటు కొత్తగా బార్లకు అనుమతులు మంజూరు చేయడం, బీరు ప్లాంట్లు(మైక్రో బ్రేవరీలు), జీహెచ్‌ఎంసీలో మెట్రో సిటీ వాతావరణం కనిపించేలా వైన్‌కేఫ్‌లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఆదాయం అదనం.
 
ఆదాయం కోల్పోవడం వట్టిమాటే!
గుడుంబాను నిర్మూలించేందుకు ప్రవేశపెడుతున్న చీప్‌లిక్కర్ ద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందన్న మంత్రుల మాటలకు సర్కార్ చేస్తున్న కసరత్తుకు పొంతన లేదు. చౌక మ ద్యం ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 60కి విక్రయిస్తున్న 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ ధర సగానికి తగ్గుతుంది. అదే సమయంలో చీప్‌లిక్కర్‌పై 70 శాతం నుంచి 90 శాతం వరకు వసూలు చేస్తున్న వ్యాట్(విలువ ఆధారిత పన్ను) 49 శాతానికి తగ్గనుంది.

దీనినే సుమారు వెయ్యి కోట్ల నష్టంగా ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. కానీ, గుడుంబాను సేవించే కస్టమర్లంతా చీప్‌లిక్కర్ వైపునకు మళ్లడం ద్వారా చౌక మద్యం అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో గుట్టుగా సాగే గుడుంబా విక్రయాలు, బెల్టుషాపులు ఇక అధికారిక దుకాణాలుగా మారనున్నాయి. తద్వారా అన్ని రకాల మద్యం గ్రామ పొలిమేరల్లోకి రావడంతో ‘చీప్’తో పాటు అన్ని రకాల మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతా యి.

గుడుంబా అమ్మకాలే అనధికారికంగా రూ. 800 కోట్ల మేర ఉంటాయని సర్కార్ అంచనా వేసింది. ఈ మొత్తం ఇప్పుడు అధికారికంగా సర్కార్ ఖాతాలో చేరనుంది. వ్యాట్ తగ్గింపు ద్వారా కోల్పోయిన ఆదాయానికి రెండింతలు గ్రామాల్లో జరిగే వ్యాపారం ద్వారా సమకూరుతుందని అధికారులు  లెక్కలు వేశారు.
 
కోల్‌బెల్ట్, పరిశ్రమల ప్రాంతాలపై దృష్టి
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో మద్యం వ్యాపారం అధికం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి పరీవాహక ప్రాంత సింగరేణి కోల్‌బెల్ట్‌లో ఇప్పటి వరకు ఉన్న మద్యం విధానాన్ని మార్చాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఒక్కటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడ లెసైన్సు ఫీజు, మద్యం అమ్మకాలు వేరుగా ఉంటాయి. మిగతా మందమర్రి, బెల్లంపెల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీలు కాగా శ్రీరాంపూర్, యైటింక్లైన్ కాలనీ, భూపాల్‌పల్లి వంటివి గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక  పాలసీని తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. అలాగే పరిశ్రమలు అధికంగా ఉన్న మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది.

మరిన్ని వార్తలు