కటకటాల కథకు వెనుక...

3 Oct, 2013 01:22 IST|Sakshi
కటకటాల కథకు వెనుక...
బో కథలోని చాలా చిక్కు ప్రశ్నలకు బీజింగ్‌లోని విలాసవంతమైన ఒక భవనం సమాధానాలను చెబుతుంది. అది పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్‌ది. ముచ్చటపడి బో దాన్ని జియాంగ్‌కు కట్టించి ఇచ్చాడు! అంత డబ్బు బోకి ఎక్కడిదని అడగటం అమాయకత్వం. 
 
 భావి చైనా అధినేతగా 2011 చివరి వరకు ఒక్క వెలుగు వెలిగి గత ఏడాదే మలిగిపోయిన బో క్సిలాయ్ ‘కథ’ ఎట్టకేలకు ముగిసింది. బో ‘తలరాత’ మారడానికి ముందు ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) అత్యున్నత నాయకత్వ సంస్థ పొలిట్ బ్యూరోలో కీలక నేత. గత నెల 22న వెలువడ్డ కోర్టు ‘తీర్పు’ ఆయనకు జీవిత ఖైదును విధించింది. ఆ సందర్భంగా బో అన్నట్టు... తీర్పు వాస్తవాలపై ఆధారపడినదీ కాదు, విచారణ సజావుగా, న్యాయంగా జరిగిందీ కాదు. అలా అని బో అవినీతి మకిలి అంటని పవిత్రుడూ కాడు. అవినీతికి పాల్పడ్డ నేతలను జైళ్లకు పంపేట్టయితే కొత్త జైళ్లను కట్టాల్సివస్తుంది. చైన్ లింగ్యూ అనే ఓ ఛోటా నేత ఆ మధ్య 40 కోట్ల డాలర్ల షాంఘై పెన్షన్ నిధులను కైంకర్యం చేసి పట్టుబడ్డారు. 
 
 భావి చైనా అధినేత హోదా వెలగబెట్టిన బో ఇంకెంత భారీ మొత్తం దిగమింగి ఉండాలి? 44 లక్షల డాలర్లు! ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిం చిన అంతర్జాతీయ హత్య, గూఢచర్యం, అమెరికాలో ఆశ్ర యం కోసం ప్రయత్నం, పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకోడానికి కుట్ర, మరో సాంస్కృతిక విప్లవం, వగైరా హాటు హాటు ఘాటు సీరియల్ కేసు కాస్తా అవినీతి కేసుగా ‘తేలిపోయింది.’ బో అవినీతి కేసు అవినీతి కేసు కానే కాదు. చైనా నేతల అవినీతి అతి పదిలంగా ఉంది. బ్రిటన్ ఎమ్16 గూఢచారి సంస్థతో సంబంధాలున్నాయని అందరికీ తెలి సిన నీల్ హేవుడ్‌తో బో కుటుంబానికి సంబంధాలుఉండేవి. బ్రిటన్ జాతీయుడైన అతడ్ని బో భార్య గు కాయ్‌లాయ్ హత్య చేయలేదనేది బహిరంగ రహస్యం. హేవుడ్ హత్యానేరంపై గత అక్టోబర్‌లో ఆమెకు మరణశిక్ష పడింది. 
 
 ఆ శిక్ష ఇంకా అమలుకాలేదు, కాదు. న్యూయార్క్‌లో చదువుతున్న కొడుకు గువాగువా జోలికి పోకుండా వదిలేస్తే, బుద్దిగా పార్టీ నూతన నేతలు చెప్పినట్లు నోరు కుట్టేసుకోడానికి గు ఒప్పందం కుదుర్చుకుంది. 2007లో చనిపోయిన తండ్రి బో యావో ప్రభావంతోనే బో క్సిలాయ్ రాజకీయ హత్యలు, గూఢచర్యం, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని అప్పట్లో పార్టీ నేతలు బాకాలూదారు. డెంగ్ హయాంలోని ‘చిరస్మరణీయమైన ఎనిమిది మంది నేతల’లో యావో ఒకడు! మావో సాంస్కృతిక విప్లవ కాలంలో అతడు జైలు పాలయ్యాడు. ఆ యావో ప్రోత్సాహంతోనే బో తాను కార్యదర్శిగా ఉన్న క్సింజియాంగ్‌లో మావోయిజాన్ని, సాంస్కృతిక విప్లవాన్ని పునరుద్ధరించ యత్నించాడని ప్రచారం సాగింది! గత ఏడాది నవంబర్లో లాంఛనంగా పార్టీ 18వ కాంగ్రెస్ జరిగేలోగానే నూతన నాయకత్వ ప్రకటన జరిగింది. ఆ తదుపరి బో పై సంధిస్తున్న ఆరోపణల అస్త్రాలన్నీ ఆగిపోయాయి. బో అవినీతికి పాల్పడి, నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణపైనే విచారణ తతంగం సాగింది. 
 
 బో కథలోని చాలా చిక్కు ప్రశ్నలకు బీజింగ్‌లోని ఒక విలాసవంతమైన భవనం సమాధానాలను చెబుతుంది. అది పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్‌ది. ముచ్చటపడి బో దాన్ని జియాంగ్‌కు కట్టించి ఇచ్చాడు! అంత డబ్బు బోకి ఎక్కడిదని అడగటం అమాయకత్వం. జియాంగ్‌తో పాటూ, మాజీ ప్రధాని వెన్ జియావో బావోకు కూడా బో అనుయాయి. వారి అండతోనే అతడు ఒక్కొక్క మెట్టే ఎక్కి పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ వాకిట నిలిచాడు. అక్కడ నుంచి కథ అడ్డం తిరిగింది. బోకి పార్టీలో ప్రధాన ప్రత్యర్థి, నేటి అధ్యక్షుడు క్సీ జింగ్‌పింగ్ తెలివిగా పావులు కదిపి, జియాంగ్, వెన్‌లను ప్రసన్నం చేసుకున్నాడు. అయినా బోలాంటి గట్టి పిండాన్ని వదుల్చుకోడం తేలికేం కాదు. క్సీకి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. బో కుడి భుజం వాంగ్ లిజున్ ఆశ్రయం కోసం అమెరికా కాన్సలేట్‌ను ఆశ్రయించి సంచలనం రేపాడు. చాంగ్‌కిగ్‌యాంగ్ పోలీస్ బాస్ అయిన వాంగ్ ప్రత్యర్థులను గుట్టుగా హతమార్చడంలో సిద్ధహస్తుడు. వాంగ్‌లాంటి పోలీసు బాసులను వాడుకొని, తర్వాత వారిని బలి పశువులను చేయడం చైనా అగ్రనేతలకు అలవాటే. వాంగ్ మిగతావారికంటే రెండాకులు ఎక్కువే చదివాడు, దీపం ఉండగానే అమెరికాకు పారిపోవాలని ప్రయత్నించాడు.
 
హేవుడ్ అసలు హంతకుడైన వాంగ్‌కు అవినీతి ఆరోపణలపై 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఓ రెండేళ్లు గడిచేసరికే వాంగ్ ‘సత్ప్రవర్తన’కు మెచ్చి విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. వాంగ్‌ను తురుపు ముక్కగా వాడి క్సి, బో ఆట కట్టించాడు. పనిలో పనిగా పార్టీలోని మరో ప్రత్యర్థి జౌ యాంగ్ కాంగ్‌ను పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలోకి రాకుండా చేశాడు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశానికి కొద్ది మంది నేతృత్వమే సమర్థవంతమైనదని సూత్రీకరించారు. పీబీ స్టాండింగ్ కమిటీని ఏడుగురికి కుదించి జౌను సాధారణ పీబీ సభ్యునిగా మిగిల్చారు. 2022 వరకు పార్టీలో క్సీకి తిరుగు లేదు.
 - పిళ్లా వెంకటేశ్వరరావు
 
మరిన్ని వార్తలు