ఎప్పుడొచ్చామన్నది కాదన్న ...

14 Feb, 2015 12:57 IST|Sakshi
ఎప్పుడొచ్చామన్నది కాదన్న ...

ఎప్పుడొచ్చామన్నది కాదన్న .... అన్నట్లు 'పోకిరీ' సినిమాలో 'పండుగాడి'లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి... ఆ సినిమా హీరోలా మరీ అంత వైలంట్గా కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సైలంట్గా తనదైన మార్కుతో ఢిల్లీ గద్దెక్కారు. ఎక్కడ పోగొట్టుకున్నామో...అక్కడే వెతుక్కోవాలన్నట్లు...ఏ రోజు అయితే సీఎం పదవికి రాజీనామా (ఫిబ్రవరి 14)  చేశారో... సరిగ్గా ఏడాది తర్వాత అదేరోజు రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

సివిల్స్లో మంచి ర్యాంకు సాధించి... ఐఆర్ఎస్ ఉద్యోగం చేస్తూ... ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి... సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలసి అవినీతికి  వ్యతిరేకంగా పోరాడిన...  అరవింద్ కేజ్రీవాల్ ... అవినీతి రహిత సమాజమే ధ్యేయంగా సామాన్యుడే లక్ష్యంగా 2012 నవంబర్లో ఆప్ పార్టీని స్థాపించారు. ఆ తర్వత ఏడాది డిసెంబర్లో 70 స్థానాల గల న్యూఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి... 28 స్థానాలకు గెలుచుకున్నారు.

ఇవే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. గత 15 ఏళ్లు వరుసగా హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంటున్న హస్తం పార్టీకి వేళ్లు విరిచి పక్కన కుర్చోబెట్టారు. అలాగే ఇవే ఎన్నికల్లో 31 సీట్లు సాధించిన బీజేపీ అధికార ఏర్పాటుకు మొగ్గు చూపక పోవడంతో హస్తం ఆసరాగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న హస్తినలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

సీఎం పీఠమెక్కిన నాటి నుంచి అన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలే... పలువురు ప్రముఖలుపై కేజ్రీవాల్ ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేసింది. అలాగే నడిరోడ్డుపై ధర్నాలు, ఆందోళనలు... జన్లోక్ పాల్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందకపోవడంతో 2014 ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేశారు. దాంతో హస్తినలో రాష్ట్రపతి పాలనకు నాంది పలికింది.ఇలా ప్రత్యర్థ పార్టీలు కేజ్రీవాల్పై దుమ్మెత్తిపోసేందుకు ఆరోపణలు చేతి నిండా సిద్ధం చేసుకున్నాయి.

మళ్లీ హస్తిన ఎన్నికల నగరా మోగటంతో ప్రత్యర్థులు తమతమ పార్టీలను విజయతీరాలకు చేర్చాలని ఎన్ని ఎత్తుగడలు వేసిన వాటన్నింటిని చిత్తు చేస్తూ హస్తిన ప్రజలు కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్'కి 67 సీట్లు కట్టబెట్టి పట్టం కట్టారు. గత హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీకి ... ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడు రేకులు మాత్రమే మిగిలాయి. 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు 'సున్నం' కొట్టారు. ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రశ్న... బ్యాలెట్ బాక్స్లో 'చీపురు కట్ట' గుర్తుకి ఓటు పడిందా లేదా అన్నట్లు ఉండాలి వ్యవహారం అని అరవింద్ కేజ్రీవాల్ తన వ్యవహార శైలితో చెప్పకనే చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు