బాబుగారూ.. బడాయితనం

28 Feb, 2016 02:39 IST|Sakshi
బాబుగారూ.. బడాయితనం

► హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్
► నా జీవితం ప్రజల కోసం త్యాగం చేశా
► అప్పుడు నేను సంపదను సృష్టించింది నేనే
► ఎన్నికల్లో చేసిన హామీల కన్నా ఎక్కువ ఇస్తున్నా
► తెలంగాణలో నా జనం ఉంటారు.. కానీ నేనక్కడికి వెళ్లలేను
► టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు
► ఎన్‌డీటీవీ ‘వాక్ ది టాక్’లో చంద్రబాబు

 ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చిద్విలాసంగా చెప్పుకున్న గొప్పలివి! నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నది గట్టుపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను అధికారిక నివాసంగా చేసుకున్న చంద్రబాబు.. ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఎన్‌డీటీవీ ‘వాక్ ది టాక్’లో ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణా నది గట్టు మీద, గెస్ట్‌హౌస్ లాన్లలో విహరిస్తూ ఆయన చెప్పిన మాటలు.. చేసిన వ్యాఖ్యలపై ఫేస్‌బుక్, ట్విటర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఆయన వ్యాఖ్యలను జోక్‌లుగా అభివర్ణిస్తూ సెటైర్లు వినవస్తున్నాయి. ఇంటర్వ్యూలో శేఖర్‌గుప్తా అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిస్తూ చేసిన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...
 
సాక్షి, హైదరాబాద్ : ‘‘నా జీవితం, రాజకీయాలు అంతా పోరాటమయం. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అందరూ నన్ను అంతం చేయాలనుకున్నారు. ఎన్నో కష్టాలు.. పదేళ్ల పాటు పోరాడి చివరకు నేను నవ్యాంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యాను.
 
హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. హైదరాబాద్, సికిందరాబాద్‌లకు నేను సైబరాబాద్‌ను చేర్చాను. నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా అన్న ఆలోచనలు వస్తాయి. కానీ.. నేను జనం కోసం హైదరాబాద్‌ను నిర్మించానన్నది వాస్తవం. వారిని అనుభవించనివ్వండి.. నేను మరో నగరాన్ని నిర్మిస్తా.

ఆరు నెలల కాలంలో.. గోదావరి నుంచి కృష్ణాకు నేను నీళ్లు తీసుకురాగలిగాను. ఈ ఏడాది 8 టీఎంసీ నీళ్లు ఇక్కడికి వచ్చాయి. పోలవరం ద్వారా గోదావరిలో వరద ఉన్నపుడు ఎంత నీటినైనా ఇక్కడికి తీసుకురాగలం. దేశంలో రెండు పెద్ద నదులను తొలిసారి అనుసంధానించాం. ఇక్కడి నుంచి పెన్నాకు తీసుకెళ్లాలనుకుంటున్నాను.
 
అప్పుడు (గతంలో అధికారంలో ఉన్నపుడు) నేను సంపదను సృష్టించాను. అది దానికదిగా కింది వర్గాల వారికి చేరుతుందని (ట్రికిల్ డౌన్) నేను భావించా. కానీ అలా జరగలేదు.. నేను అధికారం కోల్పోయాను. నా కృషి మొత్తం వృథా అయింది. ఇప్పుడు మళ్లీ మైనస్‌లో నేను మొదలు పెట్టా. సున్నాతో కాదు.నావల్లే 2004 నాటికి విద్యుత్ మిగులు ఉంది. నేను మళ్లీ అధికారంలోకి వచ్చేటప్పటికి.. ఒక్క ఏపీలోనే 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. తెలంగాణలో కాదు. ఒక నెల కాలంలోనే నేను దానిని మళ్లీ సరి (రివర్స్) చేయగలిగాను.
  
నేను ఇలా ఎందుకు పనిచేయాలి? నా కుటుంబం ఇక్కడ లేదు. వారు ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఆమె కూడా బిజీ. నాకొక మనవడు ఉన్నాడు. రోజుకు గంట సమయం కూడా గడపటం లేదు. నేను మనవడితో ఆడుకునే సమయం ఇది. కానీ నేను నా జీవితం త్యాగం చేస్తున్నాను. ఎందుకు? ప్రజల కోసం.

 నేను ఎన్నికల్లో అతిగా హామీలు ఇవ్వలేదు. నేను హామీలు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నా. కొన్నిసార్లు మేం ఆలోచనలు మార్చుకోవచ్చు. అప్పుడు అది సరికావచ్చు.. ఇప్పుడు ఇంకొకటి సరికావచ్చు. ఉదాహరణకు ఇప్పుడు 44 లక్షల పెన్షన్లు ఇస్తున్నా. ఇంటికి పంపిస్తున్నా.

తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిలో 9 మందిని (కేసీఆర్) తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అసలు పార్టీని చీల్చలేరు. దానిపై న్యాయపోరాటం ఒక నిరంతర ప్రక్రియ.
 
హైదరాబాద్‌లో తెలంగాణలో నా జనం ఉంటారు.. నేను అక్కడికి వెళ్లలేను. అక్కడ (అసెంబ్లీ ఎన్నికల్లో) పోటీ చేయలేను. 2018 ఎన్నికల్లో అక్కడ అధికారం కోసం పోటీచేస్తాం.’’

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు