రోడ్డుపక్కన వంటలపై నిషేధం!

17 Oct, 2015 10:01 IST|Sakshi

న్యూఢిల్లీ: స్ట్రీట్ ఫుడ్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్! ఢిల్లీలో రోడ్డు పక్కన ఆహార పదార్ధాలు, తినుబండారాలు వండటంపై ప్రభుత్వం నిషేధం విధించింది. రోడ్డుపక్కన టిఫిన్లు, ఫాస్ట్ ఫుడ్, చాట్ బండార్ వంటి ఆహార పదార్థాలు వండి.. అమ్ముకునే వీధి వ్యాపారాలకు ఈ నిర్ణయం శరాఘాతమే. దీనిపై వీధివ్యాపారుల అసోసియేషన్ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిద్ కేజ్రీవాల్ను కలిసి తమ నిరసన తెలుపాలని భావిస్తున్నది.

రోడ్డు పక్కన ఎలాంటి ఆహార పదార్థాలను వండరాదంటూ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్-2014 అమలులో భాగంగా కొత్త నిబంధనను ప్రభుత్వం ఈ నెల 6న జారీచేసింది. ఇందులోని కఠినమైన నిబంధనల పట్ల వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఎలాంటి ఆహార పదార్థాలు సిద్ధం చేయరాదంటూ విధించిన నిషేధం వల్ల తమ జీవితాలు మరింత రోడ్డున పడుతాయని, తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనల వల్ల ఢిల్లీలోని లక్షల మంది వీధి వ్యాపారుల జీవితం అగమ్యగోచరంగా మారుతుందని ఆ సంఘం నిరసన వ్యక్తం చేస్తుంది. మరోవైపు  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చిన ఢిల్లీ ప్రభుత్వం దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయడం కష్టమేనని, అందుకు తగినంత సిబ్బంది ప్రస్తుతం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు