చంద్రుడి మీదకు వెళ్లిన వారికి హార్ట్ ఎటాక్!

29 Jul, 2016 11:18 IST|Sakshi
చంద్రుడి మీదకు వెళ్లిన వారికి హార్ట్ ఎటాక్!

వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాలలో మానవాళి దూసుకుపోతోంది. భూ ఉపగ్రహం చంద్రుడితో పాటు సౌరకుటుంబంలోని గ్రహాలు, ఇతర నక్షత్ర మండలాలపై సైతం మానవుడి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. విశ్వంలో భూమితో పాటు జీవులకు ఇంకేమైనా నివాసయోగ్య స్థలాలు ఉన్నాయా అని శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణ చేస్తున్నారు. అయితే.. అంతరిక్ష యాత్రికులకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది.

జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ల తరువాత మొదటిసారి హార్ట్ ఎటాక్ బారిన పడ్డాడు. అయితే అప్పుడు నాసా డాక్టర్లు అతడి అంతరిక్ష యాత్రకు, హార్ట్ ఎటాక్కు ఎలాంటి సంబంధం లేదని.. ప్రీ ఫ్లైట్ టెస్టింగ్లో సైతం ఇర్విన్ హార్ట్ బీట్లో చిన్న చిన్న తేడాలు గుర్తించామని కొట్టిపారేశారు. తరువాత 61 ఏళ్ల వయసులో ఇర్విన్ హార్ట్ ఎటాక్తోనే మరణించాడు. అపోలో యాత్రలో ఇర్విన్ సహచరుడు రాన్ ఇవాన్స్ సైతం.. ఇర్విన్ మరణానికి ఏడాది ముందుగా, నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి తన 56 ఏళ్ల వయసులోనే మృతి చెందాడు. చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం 2012లో హార్ట్ ఎటాక్తోనే మరణించాడు.

అమెరికాలో ప్రతియేటా సుమారు 6 లక్షల మంది హృదయ సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఆస్ట్రోనాట్లు సైతం గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలకు అతీతులు కారు. అయినప్పటికీ సాధారణ పౌరులలో గుండె జబ్బులతో మరణించే వారితో పోల్చినప్పుడు ఆస్ల్రోనాట్లలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ విషయంపై పరిశోధన జరిపిన ఫ్లోరిడా స్టేట్ యూనిర్సిటీ డాక్టర్ మైఖెల్ డెల్ప్ మాట్లాడుతూ.. శాంపిల్ పరిమాణం చిన్నదిగా ఉన్నందున దీనిని ఇప్పుడే నిర్ధారించలేమని, అయితే ఆస్ట్రోనాట్లకు.. గుండె సంబంధ వ్యాధులకు ఉన్న సంబంధాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు