ఓ ఆడ, మగ కలసి ఓ పని చేస్తే.....

19 Jul, 2016 18:52 IST|Sakshi
ఓ ఆడ, మగ కలసి ఓ పని చేస్తే.....

కాలిఫోర్నియా: పరస్పర సహకారంతో చేయాల్సిన ఓ పనిని ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు కలసి చేస్తే ఎలా ఉంటుంది? అదే ఓ ఆడ, మగ కలసి చేస్తే ఎలా ఉంటుంది? చేసే పని పట్ల వారి దృక్పథాలు ఎలా ఉంటాయి? అప్పుడు వారి మెదళ్లు ఎలా స్పందిస్తాయి? వారి మెదళ్లలోని ఏ భాగంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అన్న విషయంలో శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి చేసే పనిని ఇద్దరు ఆడవాళ్లు చేయడంకన్నా ఇద్దరు మగవాళ్లు చేస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు.

అదే ఓ ఆడ, మగ కలసి పని చేస్తే పని పట్ల వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో, వారి మెదళ్లలో ఎక్కడ ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలసుకునేందుకు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు జరిపారు. పని చేస్తున్నప్పుడు వారి మెదళ్లను ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం ద్వారా ఫలితాలను విశ్లేషించారు. అనుకున్న పనిని పూర్తిచేసేందుకు మగవాళ్లు బహు విధాల ఆలోచిస్తారు. ఆడవాళ్లు ఒకే రీతిన ఆలోచిస్తారు. సాధారణంగా మగవాడు ఏం చేయబోతున్నాడన్నది అంచనావేసి అతడు ఆలోచనా ధోరణికి అనుగుణంగా పనిచేస్తూ ఆ పనిని పూర్తయ్యేందుకు ఆడవాళ్లు సహకరిస్తారు. ఇద్దరి దృక్పథాల్లో భిన్న ధోరణులు ఉన్నట్లే వారి మెదడులోని వేర్వేరు ప్రాంతాల్లో స్పందనలు కనిపిస్తాయి.

మగవాడు బహువిధ దృక్పథంతో ఆలోచిస్తాడు కనుక మెదడులోని కార్టెక్స్ కుడి పైభాగం స్పందిస్తుంది. ఆడవాళ్లు ఏక దృక్పథంతో ఆలోచిస్తారు కనుక కార్టెక్స్ కుడివైపు దిగువ భాగం స్పందిస్తుంది. పనిచేస్తున్నప్పుడు రక్తంలోని ఆక్సిజన్ ఏ ప్రాంతానికి ఎక్కువగా చేరుతుందో గమనించడం ద్వారా ఆ ప్రాంతం స్పందిస్తున్న విషయాన్ని గుర్తిస్తారు. 200 మంది ఆడ, మగ జంటలకు పరస్పర సహకారంతో పూర్తి చేయాల్సిన ఒకే పనిని అప్పగించడం ద్వారా ఈ ప్రయోగాన్ని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఇద్దరు ఆడవాళ్లకన్నా ఇద్దరు మగవాళ్లే నిర్దేశిత పనిని ఉత్తమంగా చేస్తారన్న గత అధ్యయనాలను కూడా ఈ ప్రయోగం శాస్త్ర విజ్ఞానపరంగా రుజువు చేస్తోంది. ఇద్దరు ఆడవాళ్లకన్నా కూడా ఒక మగ, ఆడ కలిసి బాగా పనిచేస్తారని కూడా తేలింది. ఇద్దరు మగవాళ్లు పూర్తిచేసే పనిలో, ఆడ, మగ జంట కాస్త వెనకబడినప్పటికీ వ్యత్యాసంలో పెద్ద తేడా లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఓ నిర్దేశిత పనిని పూర్తి చేయడంలో ఆడ, మగ మధ్య తేడా ఉంటుందని చెప్పడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని, పని పూర్తి చేయడంలో ఆడ, మగ మెదళ్లలో కలిగే మార్పులను సూచించడమే తమ ఉద్దేశమని పరిశోధకులు వివరించారు.

భవిష్యత్తులో ఆడ, మగ కలసి సమష్టిగా పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలో అంచాను రావడం కోసమే తమ ప్రయోగమని చెప్పారు. అయినా తాము నిర్వహించిన ఈ తాజా ప్రయోగంతో అప్పుడే ఓ నిశ్చితాభిప్రాయానికి రానవసరం లేదని, ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని వారు తెలిపారు. సాంస్కృతిక, సామాజిక పరిస్థితులనుబట్టి కూడా ఆగ, మగ దృక్పథాల్లో మార్పులు ఉండవచ్చని వారన్నారు.

మరిన్ని వార్తలు