ఔరా! ఎస్‌ఐని ఊర కుక్క కరిచిందని..!

12 Sep, 2016 11:57 IST|Sakshi
ఔరా! ఎస్‌ఐని ఊర కుక్క కరిచిందని..!

అసలే పోలీసోళ్లకు కోపం ఎక్కువ అంటారు. అందుకే ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనను కరిచిన ఊరకుక్కను తుపాకీతో కాల్చిపారేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని లక్నోలోని చిన్హాత్‌ పోలీసు స్టేషన్‌ అధికారిని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ ఆదేశించారు.

చిన్హాత్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఆదర్శ్‌ నగర్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేంద్ర ప్రతాప్‌ నివసిస్తున్నారు. డ్యూటీలో భాగంగా బరాబంకీ వెళుతుండగా ఓ ఊరకుక్క ఆయనను కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేంద్ర ప్రతాప్‌ వెంటనే ఇంటికి వెళ్లి లైసెన్స్‌డ్‌ రైఫిల్‌ తీసుకొని వచ్చి ఆ కుక్కను అక్కడికక్కడే కాల్చిపారేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో సదరు ఎస్సైపై కేసు నమోదుచేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో జంతు హక్కుల కార్యకర్తలు నిరసనబాట పట్టారు. నిందితుడైన ఎస్సై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు మెంబరైన కమ్నా పాండే ఈ అంశాన్ని కేంద్రమంత్రి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారుల్ని ఆమె ఆదేశించారు. మరోవైపు ఎస్సై తుపాకీతో కాల్చిన కుక్క పరిస్థితి ఏమైందనేది తెలియకుండా ఉంది. కాల్పుల తర్వాత ఆ కుక్క పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు