రేపట్నుంచి సబ్సిడీ ఉల్లి

4 Aug, 2015 01:45 IST|Sakshi
రేపట్నుంచి సబ్సిడీ ఉల్లి

రెవెన్యూ డివిజన్లు, రైతు బజార్లలో కిలో రూ.20 చొప్పున అమ్మకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో బుధవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిగడ్డలు సరఫరా చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలసి సోమవారం ఆయన సచివాలయంలో ఉల్లి ధరల నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రైతు బజార్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సబ్సిడీ ధరలపై ఉల్లిగడ్డలను అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. ఉల్లి సేకరణకు మార్కెటింగ్ శాఖ అధికారులతో కూడిన 3 ప్రత్యేక బృందాలు ఇప్పటికే మలక్‌పేట, కర్నూలు, నాసిక్  (మహారాష్ట్ర) వ్యాపారులతో సంప్రదింపులు ప్రారంభించిందన్నారు.
 
 సేకరణ ధరతో నిమిత్తం లేకుండా కిలోకు రూ.20 చొప్పున ప్రతీ కుటుంబానికి గరిష్టంగా 2 కిలోలు ఇస్తామన్నారు. ఉల్లి సేకరణలో నాణ్యతకు పెద్దపీట వేయాలని, ధరల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ సరైన ధ్రువీకరణ తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు. ఉల్లి సేకరణకు ఒక్కో జిల్లాకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రైతు బజార్లలో ఎస్టేట్ అధికారులు కూడా తూకం సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. కొనుగోలు, రవాణా, సరఫరా, నిల్వ, అమ్మకాలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. గుర్తింపు కార్డులు పరిశీలించి, వివరాలు నమోదు చేసిన తర్వాత తొక్కిసలాటకు తావు లేకుండా ఉల్లి అమ్మకాలు జరపాలన్నారు.

మరిన్ని వార్తలు