రాహుల్ ఎఫెక్ట్.. సిలిండర్ల సంఖ్య 12కు పెంపు?

17 Jan, 2014 18:03 IST|Sakshi
రాహుల్ ఎఫెక్ట్.. సిలిండర్ల సంఖ్య 12కు పెంపు?

గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానుండటం, ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎలాగైనా ప్రజల్లో సానుకూలత తెచ్చుకోడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంపుపై కేంద్ర మంత్రివర్గం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు.

ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఆఘమేఘాల మీద సబ్సిడీ సిలెండర్ల సంఖ్యను పెంచాలని సర్కారు భావిస్తోంది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. దటీజ్ రాహుల్ ఎఫెక్ట్!!

అయితే, ఎన్నికలు దగ్గర పడగానే సిలిండర్లు గుర్తుకొచ్చాయా అని బీజేపీ నేతలు కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఎన్నాళ్లనుంచో చెబుతున్నా, ప్రజలందరూ అడుగుతున్నా ఏమాత్రం స్పందించని మంత్రివర్గం.. ఇప్పుడు రాహుల్ పేరుచెప్పి, ఎన్నికల బూచి చూసి సిలిండర్ల సంఖ్య పెంచుతోందా అని నిలదీశారు.

>
మరిన్ని వార్తలు