న్యూస్ చానల్ బస్సుపై ఆత్మాహుతిదాడి

21 Jan, 2016 01:20 IST|Sakshi

ఏడుగురు మృతి; 24 మందికి గాయాలు

 కాబూల్: అఫ్గానిస్తాన్ తొలిసారి ఒక మీడియా సంస్థ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రాజధాని కాబూల్‌లో, రష్యా రాయబార కార్యాలయం దగ్గర ప్రముఖ న్యూస్ చానల్ ‘టోలో’ ఉద్యోగులను ఇంటికి తీసుకువెళ్తున్న మిని బస్సుపై బుధవారం ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. దాడిలో సంస్థకు చెందిన ఏడుగురు ఉద్యోగులు చనిపోయారు. 24 మంది గాయాల పాలయ్యారు. భారీ పేలుడుతో బస్సుకు మంటలంటుకోవడంతో పలువురు ఉద్యోగులు లోపలే సజీవదహనమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారిలో న్యూస్ చానల్‌కు చెందిన గ్రాఫిక్స్, డబ్బింగ్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉన్నారు.

కుందుజ్ పట్టణంలో తాలిబాన్ ఉగ్రవాదులు ఒక యువతిపై అత్యాచారం చేశారన్న వార్తను ప్రసారం చేయడంతో కొన్ని నెలల క్రితమే.. టోలో, 1టీవీ చానళ్లపై దాడులు చేస్తామని ఉగ్రవాదులు చెప్పారు.. ఆ వార్తను సైతాను వ్యవస్థల అబద్ధపు ప్రచారంగా పేర్కొన్నారు. తాలిబాన్‌తో చర్చలను పునః ప్రారంభించే నిమిత్తం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, అమెరికా దేశాల ప్రతినిధుల భేటీ రెండు రోజుల క్రితమే కాబూల్‌లో జరగడం గమనార్హం. తాలిబాన్ ప్రతినిధులెవ్వరూ ఆ భేటీలో పాల్గొనలేదు.

>
మరిన్ని వార్తలు