‘సులభ మొబైల్’తో రైతులకు 56 వేల కోట్లు

27 May, 2015 02:42 IST|Sakshi

న్యూఢిల్లీ: సులభతరమైన మొబైల్ ఆధారిత సేవల పరిచయం చేయడం ద్వారా రానున్న ఐదేళ్లలో భారతదేశంలోని ఏడు కోట్ల మంది చిన్న తరహా రైతుల ఆదాయాన్ని రూ. 56 వేల కోట్లకు పైగా పెంచవచ్చని ఒక సర్వే తెలిపింది. వ్యవసాయ సమాచారం, చెల్లింపులు, రుణాలు, ఫీల్డ్ ఆడిట్ లాంటి సాధారణ మొబైల్ సేవలు దాదాపు 2/3 వంతు రైతుల ఆదాయాన్ని ఏడాదికి సగటున రూ. 8,000 వరకు పెంచేందుకు దోహదం చేస్తాయని తన నివేదికలో పేర్కొంది. ఈ సేవల ద్వారా భారతదేశంలో ఉన్న ఏడు కోట్ల చిన్న తరహా రైతుల వ్యవసాయ ఆదాయాన్ని 2020 కల్లా రూ. 56 వేల కోట్లకు పెంచి మార్కెట్లను వృద్ధిలోకి తీసుకురావచ్చని ‘కనెక్టెడ్ ఫార్మింగ్ ఇండియా’ తన నివేదికలో తెలిపింది.

వోడాఫోన్ ఫౌండేషన్ సహకారంతో పరిశోధన చేసిన సంస్థ నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశంలో చాలా రైతు కుటుంబాలు రూ. 250 కంటే తక్కువ ఆదాయంతో ఆహారం, విద్య సదుపాయాల కోసం పోరాడుతున్నాయని తేలింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాధారణ మొబైల్ సేవల ద్వారా 2/3 వంతు రైతుల ఆదాయాన్ని పెంచి, వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి వీలవుతుందని వోడాఫోన్ మీడియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ వివరించారు.

మరిన్ని వార్తలు