రైతులకు అండగా తెలంగాణ జాగృతి

21 Sep, 2015 02:46 IST|Sakshi
రైతులకు అండగా తెలంగాణ జాగృతి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు విషాదకరమని, ఆత్మహ త్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యతని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ జాగృతి తరఫున ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఇప్పటిదాకా 80 కుటుంబాల దత్తతకు తమ శాఖలు ముందుకు వచ్చాయని, క్రీడాకారులు, ఎన్‌ఆర్‌ఐలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తల్లి నసీమాతో కలసి కవిత విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం బాధ్యతంతా భార్యపై పడుతుందని, పిల్లల చదువు భారంగా మారుతుందని, అందుకే కుటుంబాలను ఆదుకునేందుకు జాగృతి ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

దీనికోసం ప్రొ. శ్రీధర్ కన్వీనర్‌గా, దేవీప్రసాద్, ప్రొ. కోదండరాం, విజయ్‌బాబు తదితరులు సలహాదారులుగా కమిటీని నియమించామన్నారు. రైతు ఆత్మహత్యలపై అక్టోబర్‌లో వివరాలు సేకరించి విధివిధానాలు రూపొందించుకోవడంతోపాటు గ్రామ స్థాయిలో జాగృతి కార్యకర్తలతో సర్వే నిర్వహించి నవంబర్ 1 నుంచి బాధిత కుటుంబాలకు సాయం అందేలా ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు.
 
అండగా ఉంటాం: జ్వాల, ఓఝా
దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలు ఎన్నో కష్టాలు పడతాయని, బాధ్యతగల పౌరురాలిగా వారి కుటుంబాలకు అండగా ఉండాలని ముందుకొచ్చినట్లు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేర్కొన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, తమ చేతనైనంత వరకు జాగృతి కార్యక్రమాలకు అండగా ఉంటామని సానియా తరఫున అమె తల్లి నసీమా హామీ ఇచ్చారు.

తానూ రైతు కుటుంబానికి చెందిన వాడినేనని, అందుకే తానూ ముందుకొచ్చినట్లు క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా తెలిపారు. రైతులను ఆదుకోవడంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాలని జాగృతి ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. జాగృతి సంస్థకు జ్వాల రూ. లక్ష, ప్రజ్ఞాన్ ఓఝా రూ. 2 లక్షలు, సానియా రూ. 3 లక్షల చొప్పున చెక్కులను అందించారు.
 
జాగృతి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం
తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో దివంగత ప్రజాకవి కాళోజి యాదిలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ భాష అంశంపై కవి సమ్మేళనం జరిగింది. వివిధ జిల్లాల నుంచి హాజరైన కవులు తమ కవితలు వినిపించారు. రచయిత నందిని సిద్దారెడ్డి, కాంచనపల్లి, గనపురం దేవేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు