సుప్రీంలో సమైక్య పిటీషన్ల తిరస్కరణ

7 Feb, 2014 14:00 IST|Sakshi
సుప్రీంలో సమైక్య పిటీషన్ల తిరస్కరణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రాష్ట్ర భవితవ్యం ఇక పూర్తిగా పార్లమెంట్ నిర్ణయంపైనే ఆధారపడివున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అసెంబ్లీ తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వేర్వేరుగా దాఖలైన సమైక్య పిటీషన్లన్నంటి కలిపి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది.

అపరిపక్వ దశలో ఉన్న పిటీషన్లను విచారించలేమంటూ న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమంటూ వెల్లడించింది. గత నవంబర్ లో దాఖలైన పిటీషన్లకు, ప్రస్తుత పరిస్థితులకు పెద్దగా తేడా లేదని అభిప్రాయపడింది. విచారణకు ఇది తగిన సమయం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.
 

మరిన్ని వార్తలు